HomeజాతీయంWife Appreciation Day | సహధర్మచారిణి: బంధానికి బలం.. బాధ్యతకు ప్రతిరూపం

Wife Appreciation Day | సహధర్మచారిణి: బంధానికి బలం.. బాధ్యతకు ప్రతిరూపం

  • అర్ధాంగి శ్రమకు అక్షర నీరాజనం

మనుగడ ప్రవాహంలో గృహసీమను స్వర్గతుల్యం చేస్తూ, నిరంతర త్యాగనిరతితో కుటుంబ సౌభాగ్యాన్ని నిలిపే ఇల్లాలి శ్రమ అపురూపమైనది. సప్తపది నడకతో మొదలైన దాంపత్య యాత్రలో భర్త అడుగులో అడుగు వేస్తూ, సుఖదుఃఖాల వేదికపై ఆత్మీయ నేస్తమై నిలిచే భార్య పాత్ర వెలకట్టలేనిది. ప్రతి ఏటా సెప్టెంబర్‌ మాసపు మూడో ఆదివారాన్ని ‘భార్య ప్రశంసా దినోత్సవం’(Wife Appreciation Day)గా పరిగణిస్తున్న తరుణంలో, కాలగమనంలో ఈ విశేష సందర్భం సెప్టెంబర్ 20వ తేదీన వస్తోంది. ఏ ప్రభుత్వ చట్టాల గుర్తింపుతోనో, అధికారిక రాజపత్రాలతోనో ఆవిర్భవించని ఈ వేడుక, కేవలం భార్యల పట్ల కృతజ్ఞతను, ఆదరాభిమానాలను వెల్లువెత్తించే ఒక నైతిక సందర్భం.

అంతర్జాతీయ క్యాలెండర్ల చరిత్రను తరచిచూస్తే, 2006 ప్రాంతంలో అమెరికా వంటి దేశాల్లో ఈ భావన విస్తృతంగా వాడుకలోకి వచ్చిందని పరిశీలకులు భావిస్తారు. మాతృదినోత్సవం నాడు పిల్లలున్న తల్లులకే గుర్తింపు దక్కుతోందని, సంతానం లేని వివాహిత మహిళలకు సైతం దాంపత్యంలో వారి అమూల్యమైన పాత్రకు గౌరవం దక్కాలనే సదుద్దేశంతో ఈ దినోత్సవానికి బీజం పడిందనే కథనం బలంగా వినిపిస్తున్నది. ఏది ఏమైనా, బాహ్య విధులకు పరిమితం కాని ఒక అంతరంగిక కృతజ్ఞతా భావనకు ప్రతీకగా ఈ రోజు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది.

- Advertisement -

​భారతీయ సనాతన సంప్రదాయంలో స్త్రీకి, ప్రత్యేకించి భార్యకు ఇచ్చిన స్థానం అత్యున్నతమైనది. పురాణ కావ్యాలలో భార్యను ‘సహధర్మచారిణి’గా, ‘గృహిణి సచివః సఖీ మిథః’ అంటూ గృహానికి అధినేత్రిగా, క్లిష్ట సమయాల్లో మార్గదర్శనం చేసే మంత్రిగా, ఏకాంతంలో ప్రాణసఖిగా అభివర్ణించారు. సీతారాముల అన్యోన్యత, సత్యభామ సాహచర్యం, అరుంధతీ వశిష్ఠుల తపోనిష్ట వంటి దృష్టాంతాలు భారతీయ దాంపత్య ఔన్నత్యానికి నిలువుటద్దాలు.

‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్న ఆర్యోక్తి కేవలం పూజాగదిలో స్త్రీ మూర్తిని నిలబెట్టమని చెప్పలేదు; ఆమె మనోభావాలను గుర్తించి, గౌరవించి, ఆరాధించినప్పుడే ఆ లోగిలి దేవతా నివాసమవుతుందని చాటింది. ఆధునిక యుగంలో ఈ భావన కేవలం స్తోత్రాలకే పరిమితం కాకుండా నిత్యజీవితంలో ఆచరణాత్మక కార్యాచరణగా మారాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.

​ఆధునిక సమాజంలో స్త్రీ ప్రస్థానం అపరిమితమైనది. ఒకప్పుడు నాలుగు గోడలకే పరిమితమైన గృహిణి నేడు అంతరిక్ష పరిశోధనల నుంచి వ్యాపార సామ్రాజ్యాల దాకా, పాలనా రంగాల నుంచి వ్యవసాయ క్షేత్రాల దాకా సమర్థవంతంగా అడుగులు వేస్తోంది. అయితే ఆమె సాధిస్తున్న ఈ విజయాల వెనుక సమాజం గుర్తించని మరొక ముఖం ఉంది; అదే ఆమె మోస్తున్న ‘రెండో షిఫ్ట్’ భారం. బాహ్య ప్రపంచంలో ఎన్ని ఉన్నత పదవులు అధిరోహించినా, ఇంటి గడప దాటగానే కుటుంబ పోషణ, పిల్లల ఆలనాపాలనా, వృద్ధుల వైద్య సేవలు ఆమె భుజస్కంధాలపైనే నిశ్శబ్దంగా ఆధారపడు తున్నాయి.

ఈ శ్రమను భారత ప్రభుత్వ అధికారిక గణాంకాలు సైతం తేటతెల్లం చేస్తున్నాయి. భారత గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘టైమ్ యూస్ సర్వే’ నివేదిక ప్రకారం, దేశంలో ఆరేళ్లు పైబడిన జనాభాలో మహిళలు కుటుంబ సభ్యుల కోసం చేసే వేతనం లేని గృహ సేవలకు ప్రతిరోజూ సగటున దాదాపు 299 నిమిషాలు (సుమారు ఐదు గంటలు) వెచ్చిస్తుండగా, పురుషులు కేవలం 97 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారు. ఆర్థిక శాస్త్రం లెక్కగట్టలేని ఈ అదృశ్య శ్రమయే దేశ ఆర్థిక వ్యవస్థకు, కుటుంబ సమాజ నిర్మాణానికి పరోక్షంగా వెన్నెముకగా నిలుస్తోంది. ఆహార సమకూర్పు, శుభ్రత, ఆరోగ్య సంరక్షణ వంటి పనులకు జీతం ఉండదు, సెలవు ఉండదు, విశ్రాంతి అసలే ఉండదు; కేవలం బాధ్యత అనే ముద్ర వేసి సమాజం చేతులు దులుపుకుంటున్న నేపథ్యంలో భార్య ప్రశంసా దినోత్సవం(Wife Appreciation Day) ప్రతి ఒక్కరిలో అంతర్మథనాన్ని రేకెత్తించాలి.

Wife Appreciation Day Importance1

​ఈ దినోత్సవ పరమార్థం ఆర్భాటపు ఉత్సవాల్లోనో, ఖరీదైన కానుకల పంపిణీలోనో లేదు. రోజంతా అలసిసొలసి ఇంటికి చేరిన భార్యను చూసి “ఈ రోజు నువ్వు చాలా కష్టపడ్డావు, నీ శ్రమను నేను గుర్తిస్తున్నాను” అనే ఒక్క ఆర్ద్రమైన పలుకు వేల ఆభరణాల కంటే అధిక సాంత్వనను ఇస్తుంది. రాత్రి వంటలో ఒక చేయి వేయడం, పిల్లల చదువుల భారాన్ని పంచుకోవడం, ఆమె మానసిక ఉల్లాసానికి తగినంత విశ్రాంతి సమయాన్ని కేటాయించడం, ఆమె అంతరంగ భావాలకు నిశ్శబ్దంగా చెవిఒగ్గడం వంటి చిన్న చిన్న చేతలే దాంపత్యానికి జీవధాతువులు.

నేటి యాంత్రిక యుగంలో స్మార్ట్‌ఫోన్ల తెరల మధ్య మానవ సంబంధాలు మసకబారు తున్నాయి. ఒకే గదిలో ఉన్నా మాట్లాడుకోలేని నిశ్శబ్దాలు, ఉరుకుల పరుగుల జీవనశైలి తెచ్చిపెట్టే ఒత్తిళ్లు సంసార చక్రంలో సఖ్యతను హరిస్తున్నాయి. అటువంటి సమయంలో తోడుగా నడిచే అర్ధాంగి పట్ల కృతజ్ఞతను ప్రదర్శించడం దాంపత్య జీవనానికి అమృత కలశం లాంటిది.

​భార్యను ప్రశంసించడం అంటే సంవత్సరంలో కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ఆమెను కీర్తించి, మిగిలిన 364 రోజులు ఆమెను అలక్ష్యం చేయడం కాదు. ప్రశంస అనేది క్యాలెండర్ తేదీలకు లోబడిన మొక్కుబడి వ్యవహారం కారాదు; అది అనునిత్యం రక్తప్రసరణలా సాగే సహజ స్వభావం కావాలి. పురుషాధిక్య భావజాలపు తెరలను తొలగించి, భార్యను సమాన భాగస్వామిగా, స్వతంత్ర వ్యక్తిత్వం గల మనిషిగా గౌరవించినప్పుడే వివాహ బంధం సంపూర్ణత్వాన్ని సంతరించు కుంటుంది.

ఇల్లు అంటే నాలుగు ఇటుకల నిర్మాణం కాదు, అందులో నివసించే హృదయాల సంగమం; ఆ సంగమంలో అనురాగపు దీపమై వెలిగే భార్య శ్రమను అభినందించడమే ప్రశంసా దినోత్సవపు అసలైన అంతరార్థం. ఈ రోజు మొదలైన ఆత్మీయ స్పర్శ నిత్యనూతనంగా కొనసాగినప్పుడే దాంపత్యం కలకాలం పరిమళిస్తుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News