- మరింత ప్రతిష్టాత్మకంగా మార్చాలన్న విజ్ఞప్తి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లోని పాలమూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం పరిమాణం చిన్నగా ఉండటంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జాతీయ ప్రధాన రహదారుల మధ్యలో ఉన్న ప్రముఖ కూడలిలో ఇది ఏర్పాటు కావడంతో, విగ్రహం మరింత పెద్దగా, గంభీరంగా, ఆకర్షణీయంగా ఉండాల్సిందని వారు అంటున్నారు.
స్థానికుల అభిప్రాయం
కొందరు స్థానిక వ్యాపారులు, రవాణాదారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు ఈ విగ్రహాన్ని చూసి నిరాశ చెందుతున్నట్లు చెప్పుతున్నారు. అంబేద్కర్‌ను గౌరవించే విధంగా ఉండే విగ్రహం ప్రజల్లో గర్వాన్ని, ప్రేరణను కలిగించాలన్నది వారి అభిప్రాయం. కానీ ప్రస్తుత రూపం ఆ స్థాయికి సరిపోవడం లేదని పలువురు అసంతృప్తి గా భావిస్తున్నారు.
పాలమూరు చౌరస్తా అనేది ఎప్పుడు రద్దీగా ఉండే, మార్కెట్‌కు దగ్గరగా ఉండే, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు చూసే ముఖ్యమైన స్థలం. అలాంటి చోట చిన్న విగ్రహం ఉండటం వల్ల ఆ ప్రాధాన్యత తగ్గిపోతుందని స్థానికులు అంటున్నారు. మంచి శిల్పరూపం, సరైన ఎత్తు, ఆకర్షణీయమైన లైటింగ్ ఉంటేనే విగ్రహానికి తగిన గౌరవం దక్కుతుందని వారు చెబుతున్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా దర్శనం ఇవ్వడమేంటి అంటూ,విగ్రహాన్ని పెద్దదిగా, ప్రతిష్టాత్మకంగా, చూడగానే ఆకట్టుకునేలా మళ్లీ తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కల్వకుర్తికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టాలన్నది వారి ప్రధాన అభిప్రాయం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు వెంటనే స్పందించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆకర్షణీయంగా ఆహ్వానియంగా రూపుదిద్దాలని పలువురు కోరుతున్నారు.
