జవహర్‌నగర్‌లో రోడ్డు వెడల్పు పనుల పేరుతో రోడ్లను తొలగించి, నూతన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయకుండా అధికారులు, కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సీపీఐ కాప్రా మండలం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ రోడ్డు పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇదే రోడ్డుపై ప్రతిరోజూ అధికారులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ సమస్యను పట్టించుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు.
అరకొరగా మిగిలిన రహదారి కారణంగా విపరీతంగా దుమ్ము, ధూళి లేచి స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కాంట్రాక్టర్‌ను హెచ్చరించి నిలిచిపోయిన రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నిమ్మల నరసింహ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యవర్గ సభ్యులు సిహెచ్. దశరథ, సహాయ కార్యదర్శి మోతే రాజేశ్వరి, ఏఐటీయూసీ నాయకులు ఎల్లయ్య, పి. నరసింహ, గిరిజన సమాఖ్య నాయకురాలు లత, కురుమయ్య, కిరణ్, మహిళా సమాఖ్య నాయకురాలు కె. జయమ్మ, ఎమ్. అశోక్ చారి, మల్లిక, మాధవి తదితరులు పాల్గొన్నారు.
