- అమ్మకాల వత్తిడి..
- భౌగోళిక రాజకీయ వత్తిడి..
- నష్టాలకు ఇవే కారణాలు..
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఫైనాన్షియల్, ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మార్కెట్ ప్రారంభం నుంచి ఒడిదొడుకులకు లోనైంది. దిగ్గజ ఫైనాన్షియల్ స్టాక్స్‌లో బలహీనత కారణంగా ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 455.59 పాయింట్లు క్షీణించి 78,499.17 వద్ద స్థిరపడింది. ఇక, నిఫ్టీ 65.35 పాయింట్లు నష్టపోయి 24,570.65 వద్ద ముగిసింది. ఫైనాన్షియల్ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తగ్గించుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ రోజంతా బలహీనంగానే ఉంది. ముఖ్యంగా నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు అత్యధికంగా నష్టపోయి మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. నిఫ్టీ షేర్లలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్ టాప్ లూజర్లుగా నిలిచాయి.
అయితే, ప్రధాన సూచీలు నష్టపోయినప్పటికీ బ్రాడర్ మార్కెట్ కొంతమేర తట్టుకుని నిలబడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం స్వల్పంగా నష్టపోయింది. రంగాల వారీగా చూస్తే.. ఆటో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) షేర్లు మార్కెట్‌కు కొంత మద్దతునిచ్చాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ సూచీలు ప్రధాన రంగాల్లో టాప్ గెయినర్లుగా నిలిచి, సూచీల నష్టాలను కొంతవరకు పరిమితం చేశాయి.
