Homeఅంతర్జాతీయంNathu La Trade | భారత్, చైనా బహిరంగ వాణిజ్యం..

Nathu La Trade | భారత్, చైనా బహిరంగ వాణిజ్యం..

  • సిక్కింలోని నాథూలా పాస్ ద్వారా తిరిగి ప్రారంభం..
  • 2020లో ఈ వాణిజ్య మార్గం మూసివేత..

సిక్కింలోని నాథూలా పాస్‌ ద్వారా సాగే భారత్‌-చైనా బహిరంగ వాణిజ్యం మ‌ళ్లీ మొద‌లు కాబోతున్న‌ది. ఆరేళ్ల విరామం అనంతరం ఆగస్టు 1 నుంచి తిరిగి వ్యాపారం ప్రారంభం కానున్న‌ది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా 2020 లో ఈ వాణిజ్య మార్గాన్ని మూసివేశారు. తర్వాత భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాని పునరుద్ధరణలో ప్రతిష్టంభన తలెత్తింది. అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణీకరణ దిశగా సాగుతున్న నేపథ్యంలో ఈ వాణిజ్య మార్గం మళ్లీ తెరుచుకోబోతున్న‌ది. పురాతన కాలం నుంచీ ప్రపంచ ప్రధాన వాణిజ్య మార్గంగా నిలిచిన సిల్క్‌ రూట్‌లో భాగమైన నాథూలా కనుమను 1962లో భారత్‌-చైనా యుద్ధం అనంతరం మూసివేశారు.

2006లో పునఃప్రారంభించారు. ప్రస్తుతం దీన్ని తిరిగి ప్రారంభిస్తుండటం సిక్కింకు చెందిన వందల మంది స్థానిక వ్యాపారులకు, రవాణా సదుపాయాల నిర్వాహకులకు, అనుబంధ వ్యాపార కార్యకలాపాలకు ఎంతో మేలు చేయనుంది. కాగా, నాథూలా కనుమ తూర్పు సిక్కింలో 14,140 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన కనుమల్లో ఒకటిగా ఇది పేరుగాంచింది. పాత కాలంలో ప్రపంచంలో కీలక వాణిజ్య మార్గమైన సిల్క్‌ రూట్‌ టిబెట్‌ రాజధాని లాసా, సిక్కింల నుంచి తూర్పు భారత్‌ వరకూ సాగేది.

- Advertisement -

ఈ మార్గానికి నాథూలా కనుమ కీలక లంకెగా ఉండేది. నాథూలా కనుమ గుండా భారత సరిహద్దు దాటాక టిబెట్‌లోని చుంబీ లోయ వస్తుంది. భారత్, టిబెట్‌ల మధ్య శతాబ్దాలనాటి బహిరంగ వాణిజ్యానికి నాథూలా కనుమ కీలక అనుసంధాన మార్గమై నిలిచింది. ఇది భారత్, చైనాల మధ్య మూడు బహిరంగ రవాణా మార్గాల్లో ఒకటిగా ఉంది. మిగిలిన రెండు ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News