- అజీర్ణ సమస్యకు చెక్ పెట్టండి..
- సలహా ఇస్తున్న వైద్య నిపుణులు..
మలబద్ధకం చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ జీర్ణ సమస్య. సాధారణంగా వారానికి మూడు సార్ల కంటే తక్కువగా మల విసర్జన జరగడం లేదా మలం గట్టిపడి బయటకు రావడానికి ఇబ్బంది కలగడం మలబద్ధకానికి సంకేతంగా భావిస్తారు. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, వెన్నునొప్పి, అలసట వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. తగినంత నీరు తాగకపోవడం, తక్కువ పీచు పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం మాత్రమే కాదు, మనం రోజూ తినే కొన్ని ఆహారాలు కూడా మలబద్ధకాన్ని పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పాలు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం కొందరిలో మలబద్ధకానికి కారణమవుతుంది. వీటిలో ఉండే లాక్టోజ్ కొంతమందిలో అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే వీటిలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అయితే అన్ని పాల ఉత్పత్తులను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ప్రోబయోటిక్స్ ఉన్న పెరుగు జీర్ణక్రియకు సహాయపడుతూ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
