- డిమాండ్ చేసిన ఇండియా కూటమి..
- సోమవారం కూటమి సమావేశం అనంతరం ప్రకటన..
నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల వివాదాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ‘ఇండియా’ కూటమి నేతలు డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో మొత్తం 25 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు పాల్గొని భవిష్యత్తు వ్యూహాలపై చర్చించారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూటమి తీసుకున్న ఐదు కీలక నిర్ణయాలను ఖర్గే ప్రకటించారు. ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో జరిగిన లోపాలు, ‘ఓట్ల దోపిడీ’ అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.
ఈ లేఖను వీలైనంత త్వరగా ఆయనకు అందజేయనున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హయాంలోనే నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని.. దీనివల్ల లక్షలాది మంది యువత భవిష్యత్తు రోడ్డున పడిందని మండిపడ్డారు. ఇందుకు బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. దేశంలోని తీవ్ర ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, రైతుల సమస్యలపై కూటమి తరఫున నిరంతర పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా తదుపరి కూటమి సమావేశాన్ని వచ్చే ఆగస్టులో హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన తేదీని త్వరలోనే ఖరారు చేస్తారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నడవాలని నిర్ణయించాయి. ఇందుకోసం పార్లమెంట్ జరుగుతున్న ప్రతిరోజు ఉదయం లోక్‌సభ ప్రతిపక్ష నేత కార్యాలయంలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
