Friday, November 14, 2025
ePaper
Homeస్పోర్ట్స్Victory | అష్టకష్టాల నుంచి అంతర్జాతీయ వేదికపై సగర్వంగా..

Victory | అష్టకష్టాల నుంచి అంతర్జాతీయ వేదికపై సగర్వంగా..

యాభై ఏళ్ల కిందట ఉన్న అలాంటి కష్టాలను అధిగ మించి.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సగర్వంగా జెండాను రెపరెపలాడించేందుకు టీమ్ ఇం డియా సిద్ధమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని మహిళల జట్టు.. వన్డే ప్రపంచ కప్ విజేతగా ఇబ్బందులు నిలిస్తే ఆర్థిక పూర్తిగా తొలగిపోతాయి. ఇదంతా ఒకెత్తు అయితే.. ఆ ట్రోఫీని సాధిస్తే భారత మహిళా క్రికెట్లో భారీ మార్పులు రావడం ఖాయం. ఇప్పటికే బీసీసీఐ అలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇప్పుడీ టైటిల్సూ గెలిస్తే మరింత మంది అమ్మాయిలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంటారు. మూడోసారి ఫైనల్కు చేరిన భారత్ ముందు ఉన్న ఏకైక లక్ష్యం విజేతగా నిలవడం. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచి సగర్వంగా తొలిసారి ట్రోఫీని ముద్దాడాలనేది ప్రతి భారత క్రికెట్ అభిమాని ఆకాంక్ష.


ప్రైజ్మనీ భారీగా.. పురుషుల క్రికెట్తో పోలిస్తే మహిళా క్రికెట్కు వీక్షణ పరంగా మొదట్లో ఆదరణ చాలా తక్కువ. అయితే, గత ఐదేళ్ల నుంచి ఈ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఆర్థికంగానూ బీసీసీఐ మెరుగైన చెల్లింపులు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు వరల్డ్ కప్ విజేతగా నిలిస్తే ఐసీసీ కూడా భారీ మొత్తాన్ని ప్రైజ్మ్నగా ఇవ్వనుంది. అదీనూ పురుష ప్రపంచ కప్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఛాంపియన్గా నిలిచే టీమ్కు రూ.39.50 కోట్లు, రన్నరప్ టీమ్కు రూ.19.78 కోట్లు దక్కుతాయి. భారత్ గెలిస్తే బీసీసీఐ కూడా భారీ మొత్తంలో ఇచ్చేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. అప్పుడు మా కష్టాలు అవీ.. ఇప్పుడు మహిళా క్రికెటరు అంతర్జాతీయ మ్యాచులతోపాటు డబ్ల్యూపీఎల్ ఉండటంతో సంపాదనకు డోకా లేదు.

పురుష క్రికెటర్లతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ.. కనీస ఆదాయమంటూ ఉంది. కానీ, మహిళా క్రికెట్ మొదలైన రోజుల్లో తాము చాలా కష్టాలు పడ్డామని అప్పటి పరిస్థితులను నూతన్ గావస్కర్ గుర్తు చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సోదరి అయిన ఆమె మహిళా క్రికెట్ అసోసియేషన్కు కార్యదర్శిగానూ పనిచేసిన మాజీ క్రికెటర్. “అప్పుడు మాకు పర్యటనలు చేసేందుకు డబ్బు లేదు. స్పాన్సర్లూ లేరు. విదేశీ పర్యటనలు గగనమే. అటువంటి పరిస్థితుల్లోనూ కొనసాగాలని కోరుకున్న బలమైన మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్ కాదని వారికి చెప్పాం.

న్యూజిలాండ్ వంటి దేశానికి వెళ్లినప్పుడు ఎన్ఆర్ఐల ఇళ్లల్లోనే ఉండేవాళ్లం. సినీ యాక్టర్ మందిరా బేడి చాలాసార్లు ఆర్థిక సాయం అందించింది. ఆమె వల్లే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు విమాన టికెట్లను కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా కూడా అప్పుడప్పుడు టికెట్లను స్పాన్సర్ చేసేది. అప్పట్లో జట్టు వద్ద మొత్తం మూడే బ్యాట్లు ఉండేవి. ఓపెనర్లు ఇద్దరికి రెండు బ్యాట్లు, వనౌన్ ప్లేయర్ దగ్గర ఒక బ్యాట్. ఎవరైనా ఔటై వచ్చినప్పుడు ఆ బ్యాట్ తీసుకొని మరొక ప్లేయర్ క్రీజ్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండేవాళ్లు. క్రికెట్ ప్యాడ్ల పరిస్థితి కూడా అదే. వ్యక్తిగత కిట్లు కొనుగోలు చేయాలంటే చాలా కష్టం. 1970, 80ల్లో దేశంలో జరిగే మ్యాచులకు రైళ్లలోనే ప్రయాణించేవాళ్లం.

టికెట్లకు మా సొంత డబ్బులనే వినియోగించేవాళ్లం. డార్మిటరీల్లో ఉంటూ కేవలం 4 వాష్రూమ్లను 20 మంది ప్లేయర్లు వాడుకొనేవాళ్లం. స్థానికంగా ఉండే కొన్ని సంఘాల వారే పప్పు అన్నం వండి పెట్టేవారు. మాజీ ప్లేయర్లు డయానా ఎడుల్జీ, శాంత రంగస్వామి, శుభాగ్ని కులకర్ణి వీటన్నింటిని అనుభవించారు” అని నూతన్ గావస్కర్ వెల్లడించారు. మహిళల టీమ్ ఇండియా మొదటి టెస్టు కెప్టెన్ శాంత రంగస్వామి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిపారు. ఇప్పుడు భారత మహిళా జట్టు ఈ స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. “ఇప్పుడున్న అమ్మాయిలకు చాలా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వాటన్నింటికీ వారు పూర్తిగా అర్హులే. 50 ఏళ్ల కిందట మేం వేసిన పునాదికి ఇప్పుడు ప్రతిఫలం వస్తోంది. తప్పకుండా మున్ముందు తరాలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడంలో మరింత ఆసక్తి చూపిస్తాయని భావిస్తున్నాం” అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News