- గచ్చిబౌలిలో రేపు సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ..Manmohan Singh
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్..Manmohan Singh
మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరంలోని ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ విగ్రహం కేవలం ఒక స్మారక చిహ్నం కాదని, దేశ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ పోషించిన పాత్ర, ఆయన ఆర్థిక దార్శనికత, నిస్వార్థ ప్రజాసేవ, నిరాడంబర నాయకత్వ లక్షణాలను భవిష్యత్ తరాలకు గుర్తుచేసే ఒక శాశ్వత ప్రతీక అని ఆయన అభివర్ణించారు.
మన్మోహన్ సింగ్ పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పొన్నం కొనియాడారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన ప్రారంభించిన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు బాటలు వేశాయని గుర్తుచేశారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన హయాంలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం వంటివి అమల్లోకి వచ్చాయని తెలిపారు.(epaper.aadabhyderabad.in \ https://www.youtube.com/@aadabhyderabadtv)
