Homeఆదాబ్ ప్రత్యేకంExtramarital Affairs | మూడు ముళ్ల బంధానికి మూడో వ్యక్తి ముప్పు..!

Extramarital Affairs | మూడు ముళ్ల బంధానికి మూడో వ్యక్తి ముప్పు..!

  • తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న కుటుంబ వ్యవస్థ
  • విచ్చిన్నానికి కారణం అవుతున్న అక్రమ సంబంధాలు
  • సుపారీలు ఇచ్చి మరీ హత్యలు చేయిస్తున్న దారుణం
  • కుటుంబంపై ప్రభావం.. అనాథలవుతున్న చిన్నారులు
  • పాత పరిచయాలు, స్నేహాలు మళ్ళీ దగ్గరవడం కారణం
  • వైవాహిక జీవితానికి అర్ధం మార్చేస్తున్న బాంధవ్యాలు
  • భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు గడ్డు కాలం
  • ఆరు నెలల్లో 554 ఘటనలు : ఏకం న్యాయ్ ఫౌండేషన్

ధర్మార్థ కామ మోక్షాలు.. చతుర్విద పురుషార్థాలకు అర్ధం మారిపోతోంది.. వంశవృద్ధి కోసం చేసుకొనే హిందూ వివాహం తన రూపురేఖలను మార్చుకుంటోంది.. పెళ్ళిలో ప్రమాణం చేయించిన సంప్రదాయం కేవలం కామం అనే చీకటిలో కలిసిపోతూ హిందూ వివాహ వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తోంది.. ఇలాంటి విపరీత ధోరణలు రోజు రోజుకూ పెరిగిపోతుండటం కుటుంబాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది..

ఈ ప్రపంచంలో ఎవరు తోడు లేకున్నా, రాకున్నా కుటుంబం అనేది ఎప్పుడూ ఆసరాగా ఉంటుంది.. అలాంటి కుటుంబాలు ఇప్పుడు విపరీత ధోరణులకు బలైపోతున్నాయి.. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు వికృతంగా మారుతున్నాయి.. సోషల్ మీడియా ప్రభావంతో విశృంఖల సౌఖ్యాలకు అలవాటు పడిపోతున్న దంపతులు తమ భాగస్వామిని మోసం చేస్తున్నారు.. ఈ ధోరణి రోజు రోజుకూ విపరీత పరిణామాలు సంతరించుకుంటూ భాగస్వామి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు..

- Advertisement -
Extramarital affairs impact family system

తమ ప్రాణం పోసుకుని పుట్టిన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది..? అన్న ఆలోచన కూడా చేయడం లేదు.. ధర్మార్థ కామ మోక్షాలు.. చతుర్విద పురుషార్థాలకు అర్ధం మారిపోతోంది.. వంశ వృద్ధి కోసం చేసుకొనే హిందూ వివాహం తన రూపురేఖలను మార్చుకుంటోంది.. పెళ్ళిలో ప్రమాణం చేయించబడుతున్న సంప్రదాయం కేవలం కామం అనే చీకటిలో కలిసిపోతూ హిందూ వివాహ వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తోంది.. ఇలాంటి విపరీత ధోరణలు రోజు రోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది..

దాంపత్య బంధంలో విశ్వాసం స్థానంలో అనుమానం, ఆప్యాయత స్థానంలో అక్రమ సంబంధాలు చోటు చేసుకుంటుండటంతో కుటుంబ వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన దంపతులే.. కొంతకాలానికే ఒకరినొకరు అంతమొందించుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబం ధాల నేపథ్యంలో జీవిత భాగస్వామిని మట్టుబెట్టడం.. ప్రియుడు లేదా ప్రియురాలితో కలిసి కుట్ర పన్ని సుపారీ ఇచ్చి మరీ హత్య లకు పాల్పడటం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో వరుసగా వెలుగు చూస్తున్నాయి.

సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతున్న పరిచయాలు, పాత స్నేహాలు మళ్లీ దగ్గరవడం, కుటుంబానికి తెలిసిన వ్యక్తులతోనే అక్రమ సంబంధాలు కొనసాగించడం వంటి కారణాలతో భార్యాభర్తల మధ్య అంతులేని విభేదాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ వివాదాలు చివరకు హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.

భర్త లేదా భార్యకు అనుమానం రాకుండా పథకం ప్రకారం హత్యలు చేసి వాటిని ప్రమాదం లేదా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. అయితే సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా నిందితులు చివరకు పోలీసులకు చిక్కుతున్నారు.

image 2

కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, మద్యం వ్యసనం, ఆస్తి వివాదాలు, వివాహేతర సంబంధాలు వంటి అంశాలే జీవిత భాగస్వాముల హత్యలకు ప్రధాన కారణాలుగా దర్యాప్తులో తేలుతున్నాయి. కొన్నిచోట్ల భర్తల వేధింపులు భరించలేక భార్యలు దారుణాలకు పాల్పడుతుండగా..

మరికొన్ని ఘటనల్లో భార్యల అక్రమ సంబంధాలను ప్రశ్నించిన భర్తలే ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం అనుమానంతోనే హత్యలు జరిగిన ఉదంతాలు ఉండటం శోచనీయం.. ఇలాంటి విపరీత ధోరణులతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించగా, మరొకరు జైలుపాలవడంతో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. మరికొన్ని కేసుల్లో భర్త పేరుమీద ఉన్న బీమా, ఆస్తులు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే హత్యలు చేసినట్లు దర్యాప్తులో బయటపడుతోంది.

554 ఘటనలు నమోదు చేసిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ :

గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన’ విడుదల చేసిన డాక్యుమెంటేషన్ నివేదిక ప్రకారం, 2026 తొలి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది భర్తలకు సంబంధించిన హత్యలు, ఆత్మహత్యల ఘటనలు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో 322 మంది హత్యకు గురికాగా, 232 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది. హత్యకు గురైన వారిలో 194 కేసులు అంటే 60.2 శాతం వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగినట్లు నివేదికలో పేర్కొంది.

image 3

కుటుంబ కలహాలు, గృహహింస, మానసిక వేధింపులు, తప్పుడు కేసులు, పిల్లలను దూరం చేయడం వంటి కారణాలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వివరించింది. అయితే ఈ వివరాలు ప్రభుత్వ అధికారిక గణాంకాలు కాదని, మీడియా కథనాలు, సంస్థ సేకరించిన సమాచారంతో రూపొందించిన డాక్యుమెంటేషన్ మాత్రమేనని ఫౌండేషన్ స్పష్టం చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న ఘటనలు :

జాతీయ నేర గణాంకాల సంస్థ అందించిన వివరాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా నమోదవుతున్న హత్యల్లో గణనీయమైన సంఖ్య వివాహేతర సంబంధాలు, లైంగిక అసూయ కారణంగానే జరుగుతోంది. కుటుంబ వివాదాలు, గృహహింస, ఆర్థిక సమస్యలు, మద్యం వ్యసనం వంటి అంశాలు కూడా దాంపత్య బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

కుటుంబ వ్యవస్థను కాపాడాలంటే సమస్యలను సంభాషణ, కౌన్సెలింగ్, చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇలాంటి దారుణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News