- అమెరికా అణ్వస్త్ర ప్రయోగాలు
- సమర్థించుకున్న అధ్యక్షుడు ట్రంప్
- పాక్ కూడా పరీక్షలు చేసిందంటూ వ్యాఖ్యలు..
- ఇతర దేశాల మాదిరిగానే మేమూ ఈ పరీక్షలు నిర్వహిస్తామన్న ట్రంప్
మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించి
ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సవాల్ విసిరారు. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్ర రాజ్యాధినేత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని పేర్కొన్నారు. సీబీఎస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్ వంటి దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయి.
కానీ, వీటి గురించి ఆయా దేశాలు మాట్లాడట్లేదు. మేం అలా కాదు. ఏదైనా బహిరంగంగానే చేస్తాం. దాని గురించి మాట్లాడతాం. ఇన్నాళ్లూ ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా మేం వాటి జోలికి వెళ్లలేదు. ఇకపై అలా మిగిలి పోవాలనుకోవట్లేదు. ఇతర దేశాల మాదిరిగానే మేమూ ఈ పరీక్షలు నిర్వహిస్తాం అని ట్రంప్ వెల్లడించారు. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయి. మా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మావద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు. కానీ, అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్తో చర్చించా అని ట్రంప్ తెలిపారు.
అమెరికా అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఎప్పుడు, ఎక్కడ ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. దక్షిణ కొరియాలోని బుసాన్లో ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీకి ముందు ‘ట్రూత్ సోషల్’లో దీనిపై పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశముంది. అందుకే మన దేశం మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశానని ట్రంప్ తెలిపారు.
