- అంగరంగ వైభవంగా మహిళామణుల సమూహిక మణిదీప వర్ణ పూజ
కార్తీక మాసం పవిత్రతతో కొండపాక ఆనంద నిలయం ఆధ్యాత్మిక క్షేత్రం భక్తి క్షేత్రంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు మాచికంటి జోష్నా ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థంగా 300 మంది మహిళామణులు అష్టాదశ శక్తి పీఠంలో కలిసి సామూహిక మణిదీప వర్ణ పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పూజ విశేషం, కొత్తగా గృహప్రవేశం చేసిన కుటుంబాలు ఇంట్లో తొమ్మిది సార్లు మణిదీప వర్ణ పారాయణం చేస్తే, ఆ ఇంటికి సుఖసంతోషాలు, సమృద్ధి వసిస్తాయని పురాణప్రసిద్ధం. అమ్మవారు నవశక్తి స్వరూపిణిగా కాపాడతారని పండితులు చెబుతున్నారు.

పూజ సందర్భంగా 18 శక్తి స్వరూపిణులైన అమ్మవార్లకు చీరల సమర్పణ, 18 సుకన్యలకు పసుపు కార్యక్రమం నిర్వహించారు. పూజా విధానంలో ప్రత్యేకంగా 33 పవడాలు, 33 చిట్టి గాజులు, 33 గవ్వలు, 33 నల్లపూసలు, 33 ముత్యాలు, 33 గురిగింజలు, 33 గోమతి చక్రాలు, 33 తామరగింజలు, 33 పచ్చళ్ళు, 33 కెంపులు, జాకిడిబట్ట వంటి పూజా సామాగ్రి అమ్మవారికి సమర్పించబడింది.

పండితుల చెప్పిన ప్రకారం, “ఇలాంటి పూజలో భాగంగా తొమ్మిది సార్లు అమ్మవారి పారాయణం చేస్తే మన కుటుంబం, మన ప్రాంతం, మన దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది” అని తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమానికి మిర్యాలగూడ, నల్గొండ, జనగామ, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల నుండి మహిళామణులు తరలివచ్చి పాల్గొన్నారు. “కొండపాక శక్తిపీఠానికి రావడం అంటే జన్మలో పొందిన సుకృతమే” అని వారు పేర్కొన్నారు.
