Sunday, May 24, 2026
Homeమెదక్‌Edupayala Temple | దైవ క్షేత్రం..! రాజకీయ రంగస్థలం..!!

Edupayala Temple | దైవ క్షేత్రం..! రాజకీయ రంగస్థలం..!!

  • రాజకీయ అస్త్రంగా మారుతున్న ఏడుపాయల..?
  • రాజకీయ లబ్ది కోసం అమ్మవారిపై ప్రమాణాలు
  • దేవస్థానంపై కమ్ముకుంటున్న రాజకీయ నీడలు
  • పర్యాటకానికి అపార అవకాశాలు.. అటకెక్కిన మాస్టర్ ప్లాన్…!
  • ఆలయ పవిత్రత, ప్రతిష్ట కాపాడాలంటున్న భక్తులు

ప్రకృతి ఒడిలో వెలసిన ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానం లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. కానీ ఇటీవలి కాలంలో ఈ పవిత్ర క్షేత్రం భక్తి కంటే రాజకీయ చర్చలకే ఎక్కువగా వేదికవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపించినా… నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కినా… బలప్రదర్శన చేయాలన్నా… ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించాలన్నా… ఏడుపాయలను వేదికగా మార్చుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “గుడి వద్ద రాజకీయాలు తగవు… దేవస్థానం ప్రతిష్ట కాపాడాలి” అని భక్తులు కోరుతున్నారు.

గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన ప్రమాణాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లకు ఏడుపాయలనే వేదికగా ఉపయోగించిన విషయం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అది మరువకముందే తాజాగా ఆదివారం చిన్న శంకరంపేట మండలంలో ఓ పార్టీ నాయకులు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో “ఏడుపాయల వద్ద ప్రమాణం చేద్దాం” అనే వ్యాఖ్యలు రావడం మరోసారి చర్చకు దారితీసింది.

- Advertisement -

భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలవాల్సిన దేవస్థానం ఇప్పుడు రాజకీయ సవాళ్లు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలకు కేంద్రంగా మారుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విమర్శలకు దేవస్థానాన్ని కేంద్రంగా ఎంచుకోవడం సరికాదని స్థానిక భక్తులు ఆరోపిస్తున్నారు.

పర్యాటకానికి అపార అవకాశాలు… అటకెక్కిన మాస్టర్ ప్లాన్

ఏడుపాయలు తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉన్న ప్రాంతం. సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ పాలకులు దేవస్థానాన్ని రాజకీయాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌తో కూడిన సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.35 కోట్ల నిధులు విడుదల చేసినప్పటికీ… ఇప్పటివరకు పనులు ముందుకు కదలలేదన్న విమర్శలు ఉన్నాయి. “మాస్టర్ ప్లాన్‌తో ఏడుపాయల రూపురేఖలు మార్చేస్తాం” అని చెప్పిన పాలకులు… ఇప్పుడు ఆ హామీలను గాలికి వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు జాతర సమయంలో పార్కింగ్ సమస్యలు,ట్రాఫిక్ ఇబ్బందులు,తాగునీటి కొరత, పరిశుభ్రత లోపాలు ప్రతి ఏడాది పునరావృతమవుతూనే ఉన్నాయి. రాజకీయాల కంటే అభివృద్ధిపై దృష్టి పెడితే… ఏడుపాయలు తెలంగాణలోనే కాదు దేశ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఎదుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News