- ప్రధానిని కోరిన కాంగ్రెస్ పార్టీ..
- ఈ వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలని విజ్ఞప్తి..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న సవరించిన డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు పార్టీలకు వాటిని పూర్తిగా పరిశీలించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో కూడా డీలిమిటేషన్ ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఖర్గే పేర్కొన్నారు. ఆ అభ్యర్థనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఏప్రిల్ 17న లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు-2026కు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో అది ఆమోదం పొందలేదని గుర్తు చేశారు.
ఇప్పుడు అదే బిల్లును సవరించి వర్షాకాల సమావేశాల్లో మళ్లీ తీసుకురానున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సవరించిన డీలిమిటేషన్ ప్రతిపాదనలు, అనుబంధ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని ఖర్గే లేఖలో కోరారు. బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు వాటిని అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026 కూడా ఏప్రిల్లో లోక్సభలో ఆమోదం పొందలేదు. ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళల రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేయడంతో పాటు, లోక్సభ స్థానాల సంఖ్యను 850కు పెంచడం, 1976 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు అవకాశం కల్పించనున్నారు.
