- దట్టమైన పొగతో స్థానికుల్లో భయం
జనగామ పట్టణంలో హన్మకొండ రోడ్డులోని దయనిలయం సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్సు పార్కింగ్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్ ప్రాంగణంలో నిల్వ ఉంచిన పాత బస్సు టైర్లకు మంటలు అంటుకొని ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో దట్టమైన నల్ల పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. ఈ పొగ సమీపంలోని ఇండ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారు వెంటనే బయటకు పరుగులు తీశారు. పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తమై ఆందోళనకు గురయ్యారు.



సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే పెద్ద మొత్తంలో టైర్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు కారణంగా పార్కింగ్‌లో నిర్లక్ష్యంగా నిల్వ చేసిన పాత టైర్లు ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


