Homeఆదిలాబాద్Collector Bhavesh Mishra | ప్రతి విద్యార్థి ఉన్నతికి ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలి

Collector Bhavesh Mishra | ప్రతి విద్యార్థి ఉన్నతికి ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలి

  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, విద్యార్థుల క్రమం తప్పని హాజరుతోనే ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, అవగాహన సామర్థ్యాలను పెంపొందించేలా బోధన కొనసాగించాలని సూచించారు.

- Advertisement -

తరచూ పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకోవాలని, వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోర్డు పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా సిలబస్‌ను పూర్తి చేసి, ప్రతి సబ్జెక్టును విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా బోధించాలని అన్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజూ నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యార్థుల కోసం ‘అభ్యాస దీపిక’ వెబ్‌సైట్ రూపకల్పనపై ప్రధానోపాధ్యాయుడికి అభినందన

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘అభ్యాస దీపిక’ వెబ్‌సైట్‌ను రూపొందించిన ప్రధానోపాధ్యాయుడు మునిందర్ రాజును జిల్లా కలెక్టర్ అభినందించారు.

గణితం తదితర సబ్జెక్టులను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలు, మెళకువలు, అభ్యాస విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చొరవతో వెబ్‌సైట్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే ఇలాంటి వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత కార్యక్రమాలను మరింత మంది ఉపాధ్యాయులు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News