- బాటసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్), బాటసింగారం విద్యార్థులు తెలంగాణ 12వ రాష్ట్రస్థాయి జావెలిన్ డే సెలబ్రేషన్ – పురుషులు, మహిళలు, సబ్ జూనియర్ మరియు జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026కు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్ తెలిపారు.
ఈ నెల ఆగస్టు 8న హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి ధనాంజనేయులు 16 ఏళ్లలోపు బాలుర విభాగం జావెలిన్ త్రో పోటీలో, అలాగే తులసిరామ్ 18 ఏళ్లలోపు బాలుర విభాగం 400 మీటర్ల పరుగు పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

ఈ నెల ఆగస్టు 1న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో విశిష్ట ప్రతిభ కనబరిచి, ఈ ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
విద్యార్థుల ఈ విజయంపై ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ గౌరీ శంకరాచారి, ఉపసర్పంచ్ వెంకటేష్, తల్లిదండ్రులు, గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
