Homeఆదాబ్ ప్రత్యేకంAyyappa Society | అయ్యప్ప సొసైటీలో పర్మిషన్లు నిల్... నిర్మాణాలు పుల్..

Ayyappa Society | అయ్యప్ప సొసైటీలో పర్మిషన్లు నిల్… నిర్మాణాలు పుల్..

  • అక్రమ నిర్మాణాలపై సీఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం
  • విచ్చలవిడిగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు
  • మణికొండ భవన ప్రమాదం నేపథ్యంలో భద్రతపై ఆందోళన
  • అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • సీఎం జోక్యం చేసుకోవాలని సామాజిక సంఘాల డిమాండ్

మాధాపూర్ అయ్యప్ప సొసైటీకి ప్రత్యేక జీవో ఉందా.. ఉంటే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి..!

హైదరాబాద్‌కు గుండెకాయలాంటి మాదాపూర్, అయ్యప్ప సొసైటీలో(Ayyappa Society) నిర్మాణాలకు అనుమతులు శూన్యం.. అక్రమ నిర్మాణాలపర్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దశాబ్దాలుగా జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలు, అధికారుల మౌనం.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియాకు సరికొత్త ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఒక వైపు సీఎంసీ., వంటి ప్రతిష్టాత్మక అధికారిక సంస్థ కనుసన్నల్లోనే ఈ విచ్చలవిడితనం సాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
Ayyappa Society Illegal Construction Allegations 1

హైదరాబాద్‌కు గుండెకాయలాంటి మాదాపూర్, అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలకు అనుమతులు శూన్యం.. అక్రమ నిర్మాణాలపర్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దశాబ్దాలుగా జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలు, అధికారుల మౌనం.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియాకు సరికొత్త ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఒక వైపు సీఎంసీ., వంటి ప్రతిష్టాత్మక అధికారిక సంస్థ కనుసన్నల్లోనే ఈ విచ్చలవిడితనం సాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ ప్రాంతం మున్సిపల్ పరిధిలోకి రాదా? లేక ఈ ఒక్క సొసైటీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైనా చట్టాన్ని రూపొందించిందా? అని సామాన్యులు, మేధావులు నిలదీస్తున్నారు.

ఒకవేళ అలాంటి ప్రత్యేక వెసులుబాట్లు ఏమైనా ఉంటే, వాటిని తక్షణమే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న ఈ అనధికారిక వ్యవహారాలనే బూచిగా చూపించి, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇదే తంతు కొనసాగితే, భవిష్యత్తులో న్యాయస్థానాలు తీవ్రంగా స్పందించే అవకాశం లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యవస్థ అదుపుతప్పి, పరిస్థితులు పూర్తిగా దిగజారకముందే ప్రభుత్వం, మున్సిపల్ శాఖ తక్షణమే మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

అయ్యప్ప సొసైటీ.. ఇక్కడ ఎలాంటి రుసుము ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదా..? కళ్లెదుటే ఇన్ని అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగంగా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు.. సీఎంసీలోని కొందరు అధికారులు అయ్యప్ప సొసైటీ పరిధిలో ఎంతకు అమ్ముడు పోయి ఉండచ్చు..? తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏమైనా అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు నిర్మించుకోవచ్చు అనే అంతర్గత చట్టాలు ఏమైనా ఉన్నాయా..? సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసలు ఏమి జరుగుతోంది..?

Ayyappa Society Illegal Construction Allegations4

అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతూ అధికారులు అక్రమ సంపాదనకు ఎగబడుతున్నారన్నది యదార్ధం.. ఈ అక్రమాల్లో తమవంతు సహకారం అందిస్తున్న అధికారులెవరూ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. కాగా ఇటీవలే మణికొండలో ఇదే తరహాలో భారీ భవనం ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే.. అది కూలి పలువురు కూలీలు దుర్మరణం పాలైన సంఘటన మరవక ముందే ఇలాంటి అక్రమ నిర్మాణాలు అయ్యప్ప సొసైటీలో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి..

అడ్డదారిలో కాలేజీలు, కమర్షియల్ నిర్మాణాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తూనే వున్నాయి.. ఇది అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడినట్లు కాదా..? ఎలాంటి కనీస అనుమతులు లేకుండా.. ఫైర్ సేఫ్టీకి పాతరేస్తూ చేస్తున్న ఈ అక్రమ నిర్మాణాల్లో కాలేజీల అనుమతులు ఎలా సాధ్యమవుతున్నాయన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.. కేవలం బోగస్ పత్రాలతో అనుమతులు ఉన్నట్లు కలరింగ్ ఇస్త్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. ఇదంతా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణ దారులకు అమ్ముడు పోయి చేస్తున్న వ్యవహారం.. అక్రమాలకు ఆజ్యం పోస్తూ చేస్తున్న ఈ అక్రమ నిర్మాణాలకు కూల్చకుండా అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం వీరి అంతులేని అవినీతికి అద్దం పడుతుంది..

Ayyappa Society Illegal Construction Allegations7

కాగా సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు అక్రమ నిర్మాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసిన ఉత్తర్వులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వర్తించావా..? సదరు మున్సిపల్ అధికారులకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అంటే లెక్క లేదా అని ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు.. దేశ సర్వోన్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలకు ఇచ్చిన ఆదేశాలు : డి. నెంబర్ : 22381/2025 ఎస్.ఈ.సి. – 16.. తేది : 05-05-2025 ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల ఉన్నతాధికారులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన లేఖ.. ఆర్.ఓ.సీ నెంబర్.1004/ఎస్.ఓ/2025 తేది : 16-06-2025. ద్వారా అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు చేయాల్సిన పనులు చట్ట ప్రకారం చేయకుండా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినట్లు అవుతుందని, అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు స్పష్టం చేస్తున్నాయి..

Ayyappa Society Illegal Construction Allegations8

ఈ అధికారుల అక్రమ వ్యవహారాలకు, అక్రమ నిర్మాణాలు కట్టడి చేసే యంత్రాంగం ఎక్కడ పొందిందని పలువురు సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వం సీఎంసీ పరిధిలో ఇతర ప్రాంతాల్లో ఏ రకంగానైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుందో అదే తరహాలో అయ్యప్ప సొసైటీలో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.. అక్రమ నిర్మాణాలు విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మున్సిపల్ శాఖ అధికారులు అమలు చేయాలి.. తక్షణమే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి.. చట్టం ముందు అందరు సమానమే అని, పారదర్శకత పాలన అందిస్తున్నట్లు నిరూపణ చేయాలి.. లేకపోతే అయ్యప్ప సొసైటీని బూచిగా చూపి, ఇతర ప్రాంతాల్లో సైతం అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా జరిగే అవకాశం వుంది.. కనుక ముఖ్యమంత్రి తక్షణమే అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న తంతుపై దృష్టిపెట్టి, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఖజానాకు ఢోకా లేకుండా చేసుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు..

కనుక సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖలో జరుగుతున్న ఈ తంతుపై దృష్టిపెట్టి, మీ శాఖను ప్రక్షాళన చేయకపోతే మీకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.. పైగా ఈ వ్యవహారంలో మీ పాత్ర కూడా ఉందనే అనుమానాలు కూడా తలెత్తుతాయి.. ఇంకొక విషయం ఏమిటంటే.. పలువురు ప్రజా ప్రతినిధులు, సామాజిక సంఘాల వారు ఆందోళన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.. అలాంటి పరిస్థితులు ఎదురవకముందే ముఖ్యమంత్రి మేలుకోవాలని పలువురు సూచిస్తున్నారు.. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టే వరకు ‘ఆదాబ్ హైదరాబాద’ పోరాటం చేస్తూనే ఉంటుంది ‘మా అక్షరం అవినీతిపై అస్రం’..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News