- విశాఖ ఎకనామిగా రీజియన్ అభివృద్ధి..
- అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అత్యంత కీలకమైన విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ బృహత్ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.9.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సమీక్షా సమావేశంలో వీఈఆర్ ప్రాజెక్టు ఆర్థిక స్వరూపాన్ని, కార్యాచరణను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం పెట్టుబడులలో భాగంగా ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల వరకు సమకూర్చాలని, మిగిలిన రూ.5.30 లక్షల కోట్లను ప్రైవేట్ రంగం నుంచి రాబట్టేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించారు.
‘బేసిటీ’ ప్రాజెక్టును యాంకర్ ప్రాజెక్టుగా చేసుకుని విశాఖ రీజియన్ అభివృద్ధిని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. వీఈఆర్ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని సూక్ష్మ స్థాయి ప్రణాళికతో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రణాళిక మూలపేట పోర్టు నుంచి రాజమండ్రిలోని అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు విస్తరించి ఉండాలని ఆయన సూచించారు.
ఏఐ డేటా సెంటర్ల ఎకో సిస్టం, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీ వంటి కీలక రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. వివిధ ప్రాజెక్టులను పరస్పరం అనుసంధానించడం ద్వారానే విశాఖ ఎకనామిక్ రీజియన్ వేగంగా ప్రగతి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. నిధుల కన్వర్జెన్స్ పద్ధతిని అనుసరించాలని, అవసరమైన చోట వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) స్కీంను కూడా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
