- సమస్యలు తీర్చకుంటే సమ్మెకే!
- నవంబర్ 6, 8న గనులు,జీఎం కార్యాలయాల ముందు నిరసనలు
సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణిని వ్యతిరేకిస్తూ సమ్మెకైనా సిద్ధమేనని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అల్టిమేటం జారీ చేశారు.ఆదివారం,గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ..స్ట్రక్చర్ మీటింగ్‌లలో అంగీకరించిన హామీలను యాజమాన్యం అమలు చేయడంలో విఫలమైందన్నారు.ముఖ్యంగా,సొంతింటి పథకాన్ని అమలు చేయకపోవడం,అలవెన్సులపై ఇన్‌కమ్ టాక్స్‌ను యాజమాన్యం చెల్లించకపోవడం,గత తొమ్మిది నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
మెడికల్‌గా ఫిట్ అయిన దాదాపు 300 మంది డిపెండెంట్లకు నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం నవంబర్ 6న అన్ని గనులు, డిపార్ట్‌మెంట్‌ల వద్ద మెమొరాండాలు, నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామని, నవంబర్ 8న జీఎం కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రకటించారు. 8వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను వివరించి, పరిష్కారం కాకుంటే జేఏసీ ఏర్పాటు చేసి సమ్మెకు పిలుపునిస్తామని రాజ్ కుమార్ హెచ్చరించారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర,ప్రాంతీయ నాయకులు పాల్గొన్నారు.
