- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో నియామకాలు..
- తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం..
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ(TGPSC) మరో భారీ శుభవార్త అందించింది.(Recruitment) రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు అవసరమైన సిబ్బంది నియామకానికి ఆర్థిక శాఖ అంగీకారం తెలిపినట్లు సమాచారం. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.
కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, అప్‌గ్రేడ్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్లలో సిబ్బంది కొరతను తీర్చేందుకు మొత్తం 886 పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో వార్డు ఆఫీసర్ స్థాయి పోస్టుల నుంచి గ్రేడ్-2, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టుల వరకు వివిధ కేటగిరీలు ఉన్నాయి. ప్రస్తుతం పలు మున్సిపాలిటీల్లో ఇతర శాఖల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి పాలనా వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. దీంతో శాశ్వత సిబ్బంది నియామకం అవసరమైంది.
పోస్టులు :
గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ పోస్టుల సంఖ్య: 20.. డిప్యూటీ కమిషనర్ (స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలకు) పోస్టుల సంఖ్య: 11
జూనియర్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 86.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 56.. హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 40.. జూనియర్ అకౌంటెంట్ పోస్టుల సంఖ్య: 40.. సీనియర్ అకౌంటెంట్ పోస్టుల సంఖ్య: 40..
ఇవే కాకుండా మున్సిపల్ పరిపాలనకు అవసరమైన మరికొన్ని కేటగిరీల పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 24 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. అలాగే కొన్ని మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో పరిపాలనా బాధ్యతలు, పట్టణ సేవలు, ఇంజినీరింగ్, పారిశుద్ధ్యం, అకౌంటింగ్ తదితర విభాగాల్లో అదనపు సిబ్బంది అవసరం ఏర్పడింది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు సమయంలోనే అధికారులు అవసరమైన సిబ్బందిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.
మొత్తం 886 మంది సిబ్బంది అవసరమని గుర్తించి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఆర్థిక శాఖ నుంచి కూడా అంగీకారం లభించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే దీనికి ఆమోదం లభిస్తుందని భావించినప్పటికీ.. సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో ప్రతిపాదన వాయిదా పడినట్లు సమాచారం. తదుపరి కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించిన తర్వాత TGPSC ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
