- కేదార్ లోయ ప్రాంతంలో నెలకొన్న ఆలయం..
- మందాకినీ నాదీ తీరాన ప్రకృతి ఒడిలో ముండకటియా గణేష్ గుడి..
వినాయక చవితి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా రకరకాల ఆకారాలు, రూపాల్లో కొలువుదీరిన లంబోదరుడిని చూసి భక్తులు పులకించిపోయారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వింతైన గణపతి ఆలయం విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా గజముఖంతో కొలువయ్యే గణనాథుడిని పూజించడం మనకు తెలుసు. కానీ ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి తల ఉండదు. దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా కేదార్ లోయ ప్రాంతంలో ఈ విశిష్టమైన ఆలయం ఉంది. పవిత్ర కేదార్నాథ్ క్షేత్రానికి వెళ్లే మార్గంలో సోన్‌ప్రయాగ్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని మందాకిని నది తీరాన ప్రకృతి ఒడిలో ఈ ముండకటియా గణేశ ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయ విశిష్టత గురించి ప్రాచీన శివపురాణంలోనూ ప్రస్తావన ఉండటం విశేషం.Uttarakhand
ఈ ఆలయం వెనుక ఒక బలమైన పౌరాణిక ఘట్టం ముడిపడి ఉంది. పార్వతీ దేవి తన నలుగు పిండితో గణేశుడిని సృష్టించి, తాను స్నానానికి వెళ్తూ ఎవరినీ లోపలికి రానివ్వవద్దని ఆజ్ఞాపించింది. తల్లి ఆజ్ఞను శిరసావహించిన బాల గణేశుడు.. పరమశివుడిని సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పరమేశ్వరుడు, తన త్రిశూలంతో బాల గణేశుడి తలను ఖండించాడు. ఆ పవిత్ర ఘట్టం జరిగిన ప్రదేశమే ఈ క్షేత్రమని స్థానిక భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంస్కృత, హిందీ భాషల్లో ముండ అంటే తల అని, కటియా అంటే నరకడం అని అర్థం. శివుడు గణేశుడి శిరస్సును నరికిన పవిత్ర స్థలం కావడంతో దీనికి ముండకటియా అనే పేరు స్థిరపడింది.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
