సృష్టికి మూలకర్త, దేవ శిల్పి అయిన భగవాన్ విశ్వకర్మ జన్మదినాన్ని(Vishwakarma Jayanti) పురస్కరించుకుని గురువారం జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి. రాజగౌడ్‌లు భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ జయంతి ప్రాముఖ్యతను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భగవాన్ విశ్వకర్మను సృష్టికి మూలకర్తగా, దేవ శిల్పిగా భక్తులు కొలుస్తారని, ప్రతి సంవత్సరం కన్యా సంక్రాంతి సందర్భంగా విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారని అధికారులు తెలిపారు. ఇంజనీర్లు, చేతివృత్తులవారు, మెకానిక్‌లు, కార్మికులు, పరిశ్రమల యజమానులు తమ వృత్తి నైపుణ్యాలు మరింత అభివృద్ధి చెందాలని, పనుల్లో నైపుణ్యం, సామర్థ్యం పెంపొందాలని విశ్వకర్మను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటారని పేర్కొన్నారు.
పరిశ్రమలు, వర్క్‌షాప్‌లు, వివిధ సంస్థల్లో ఉపయోగించే యంత్రాలు, వాహనాలు, పనిముట్లను శుభ్రం చేసి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశ్వకర్మ జయంతి సందర్భంగా పాటించే ఆచారమని తెలిపారు. సాంకేతిక రంగం, చేతివృత్తులు, పారిశ్రామిక అభివృద్ధిలో విశ్వకర్మ ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
