- ఖరీఫ్‌లోనే కష్టాల పాలు..
- ప్రభుత్వం తీరుపై రైతుల అసంతృప్తి
వర్షాలు లేక పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులకు అప్రకటిత విద్యుత్ కోతలు(Power Cuts) మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. పాపన్నపేట మండల(Papannapet Mandal) వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5 గంటలకు రావాల్సిన విద్యుత్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆలస్యమవుతూ, కొన్ని ప్రాంతాల్లో 7 గంటల తర్వాతే సరఫరా అవుతోందని రైతులు వాపోతున్నారు.
దీంతో బోర్లపై ఆధారపడిన రైతులు పంటలకు నీరందించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 20 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చినా.. ప్రస్తుతం కనీసం 12 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితితో సాగు పనులకు ఆటంకం ఏర్పడుతోందని, అప్రకటిత కోతలను నివారించి పంటలను కాపాడుకునేలా నిరంతరాయ విద్యుత్ అందించాలని రైతులు కోరుతున్నారు.
కోతలు విధించకుండా కరెంటివ్వండి – రైతు సాయిలు
ఉదయాన్నే నాలుగు గంటలకు పొలం వద్దకు చేరుకున్న. 7 గంటల వరకు కరెంట్ రాలేదు. ఎలాంటి కోతలు విధించకుండా కరెంటు ఇవ్వాలని కుర్తివాడకు చెందిన రైతు సాయిలు అధికారులను కోరుతున్నారు.
ఏఈ వివరణ:
విద్యుత్ కోతలపై పాపన్నపేట(Papannapet) విద్యుత్ శాఖ ఏఈ నర్సింలు ను సంప్రదించగా.. ఎగువ నుంచి సరఫరా తగ్గిందని, ఆ మేరకే రైతులకు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
