Homeరంగారెడ్డిNegligence | డాక్టర్ నిర్లక్ష్యమా..? వైద్యం వికటించి వ్యక్తి మృతి.

Negligence | డాక్టర్ నిర్లక్ష్యమా..? వైద్యం వికటించి వ్యక్తి మృతి.

  • చికిత్సలో లోపాలే మృతికి కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు.. ఆసుపత్రి ఎదుట ధర్నా.

వైద్యం కోసం ఆక్సీకేర్ ఆసుపత్రిని ఆశ్రయించిన బొల్ల రవి (40) చికిత్స అనంతరం మృతి చెందడం కుషాయీగూడలో తీవ్ర కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం, చికిత్సలో జరిగిన లోపాలే రవి మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రవిని మొదట ఆక్సీకేర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

అయితే చికిత్స సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం ముందుగానే గుర్తించినప్పటికీ, తమకు పూర్తి సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో అదే ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో రవిని మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ చివరకు మృతి చెందారని వారు తెలిపారు.తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మరో ఆసుపత్రికి తరలించారా?

- Advertisement -

రోగి పరిస్థితి విషమిస్తున్న విషయం ముందుగానే తెలిసినా తమకు ఎందుకు చెప్పలేదని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. మొదటి ఆసుపత్రిలో చికిత్స సమయంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకే మరో ఆసుపత్రికి తరలించారా అనే అనుమానాలను వ్యక్తం చేశారు. రోగి పరిస్థితిపై తమకు పూర్తి వాస్తవాలను వెల్లడించి ఉంటే తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

భార్య, ఇద్దరు పిల్లలతో విషాదకర పరిస్థితి

మృతుడు బొల్ల రవికి భార్య కనక లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు సాయి చరణ్, కుమార్తె హసీమిత ఉన్నారు. రవి మృతితో భార్య, పిల్లలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మృతుడి అన్న బొల్ల పద్మారావు కుటుంబానికి అండగా నిలిచారు.రవిది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ గ్రామం కాగా, గత 20 సంవత్సరాలుగా కుషాయీగూడ శుభోదయం కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

కుటుంబానికి అండగా చిన్న లక్ష్మాపూర్ సర్పంచ్

ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చిన్న లక్ష్మాపూర్ సర్పంచ్ కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆసుపత్రి ఎదుట ధర్నాలో పాల్గొన్నారు. రవి కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం న్యాయం చేయాలని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన తోడ్పాటు అందించేందుకు తాము అండగా ఉంటామని తెలిపారు.

సమగ్ర విచారణకు డిమాండ్.

రవి మృతికి అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చికిత్సకు సంబంధించిన కేస్‌షీట్, పరీక్షల నివేదికలు, మందుల వివరాలు, వైద్యుల నోట్స్, మరో ఆసుపత్రికి తరలించిన వివరాలు తదితర రికార్డులను అధికారులు పరిశీలించి వాస్తవాలను తేల్చాలని కోరుతున్నారు.

చికిత్సలో నిజంగా ఏమైనా లోపాలు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రవి మృతిపై అధికారుల సమగ్ర విచారణతోనే అసలు కారణాలు వెలుగులోకి రావాల్సి ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News