- సమగ్ర న్యాయ విచారణకై ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ డిమాండ్.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో జర్నలిస్టులపై జరిగిన దాడులు, బెదిరింపులను ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉన్నప్పటికీ, వార్తా సేకరణకు వెళ్లిన రిపోర్టర్లపై ఆందోళనకారులు లేదా భద్రతా బలగాలు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని స్పష్టం చేసింది. కొన్ని టీవీ ఛానెళ్ల రిపోర్టర్లను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, మీడియా యాజమాన్యాలు తమ సంపాదకీయ విధానాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించింది.
అలాగే, నిరసనకారులు, జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ షాక్ లాఠీలు, పెల్లెట్ గన్స్, మేకులు ఉన్న లాఠీలతో తీవ్ర స్థాయిలో బలప్రయోగం చేయడాన్ని ఫెడరేషన్ తప్పుబట్టింది. పోలీసుల దాడిలో ఔట్‌లుక్ మ్యాగజైన్‌కు చెందిన ఒక రిపోర్టర్ పెల్లెట్ గాయాలపాలైనట్లు పేర్కొంది. గుర్తింపును దాచిపెట్టేందుకు ఆర్ఏఎఫ్, ఢిల్లీ పోలీసులు తమ నేమ్ బ్యాడ్జ్‌లను తొలగించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను (డి.కె. బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్) ఉల్లంఘించడమేనని మండిపడింది.
జూలై 20, 2026న జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు సాగించిన హింసపై ఉన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ చేపట్టాలని కోరింది. పలువురు జర్నలిస్టులు గాయపడిన ఈ ఘటనపై నిష్పాక్షికమైన న్యాయ విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌతమ్ లాహిరి, సౌరభ్ దుగ్గల్ డిమాండ్ చేశారు.
