- పొంచి ఉన్న ప్రాణగండం
- విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం…
- వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఓ కుటుంబం విన్నపం…
మఠంపల్లి మండలంలోని హనుమంతుల గూడెం గ్రామంలో ఓ ఇంటిపై విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.తమ ఇంటిపై కరెంట్ తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామానికి చెందిన కొత్తపల్లి సైదమ్మ దేవదాసు ఆందోళన వ్యక్తం చేశారు.ముఖ్యంగా వర్షాకాలంలో బలమైన గాలులు,వర్షాల కారణంగా తీగలు సడలిపోవడంతో ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి పైకి వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇంటిపై చిన్నారులు చేతులతో అందుకునేంత ఎత్తులో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతుండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ఆ కుటుంబం అధికారులపై అసహనం వ్యక్తం చేస్తుంది.ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు చర్యలు తీసుకుని తీగలను ఎక్కువ ఎత్తులో బిగించాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా వేలాడుతున్న తీగలను సరిచేయాలని గ్రామస్తులు విన్న వించుకున్నారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ఎప్పుడైనా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
