రెండు అంతస్తుల అనుమతితో సెల్లార్ +7 అంతస్తుల అక్రమ నిర్మాణం
అనుమతులు ఒకలా.. నిర్మాణం మరోలా.. ఇదే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లోని కొందరు నిర్మాణదారుల తీరు. గోల్కొండ జోన్ పరిధిలోని కార్వాన్ సర్కిల్, తేజ కాలనీలో రెండు అంతస్తుల నివాస భవనానికి మాత్రమే అనుమతి తీసుకుని, ఏకంగా సెల్లార్‌తో పాటు ఏడు అంతస్తులు నిర్మించడంతో పాటు, నివాస భవనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిబంధనలు బేఖాతరు అవుతున్నా సంబంధిత అధికారులు మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
- హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల పర్వం
- కార్వాన్ సర్కిల్‌లో జీహెచఎంసీ నిబంధనలకు పాతర..
- నివాస అనుమతితో వాణిజ్య దుకాణాల ఏర్పాటు..
- టౌన్ ప్లానింగ్ అధికారులపై అవినీతి ఆరోపణలు..
- వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్..
రాజధాని నగరంలో అక్రమ నిర్మాణాల దందా యథేచ్ఛగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గోల్కొండ ప్రాంతీయ కార్యాలయం, కార్వాన్ సర్కిల్ పరిధిలోని తేజ కాలనీలో నిబంధనలను కాపాడాల్సిన నగర ప్రణాళికా విభాగం అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ కట్టడాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. “కుక్కలకు ఎముకలు వేసి, పులులను వదిలేసినట్లు” క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ భారీ అక్రమాలను అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం, అధికారులు మరియు నిర్మాణదారుల మధ్య ఉన్న ‘అక్రమ బంధాన్ని’ మరోసారి బహిర్గతం చేసింది.

ఏమిటీ అక్రమ కట్టడాల వెనుక అసలు కథ? :
షేక్‌పేట్ ప్రాంతంలోని తేజ కాలనీలో మహమ్మద్ అబ్దుల్ నసీర్ మరియు తాహెరా సుల్తానా పేర్లతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలిస్తే, ఇక్కడ జరిగిన ఉల్లంఘనల తీవ్రత అర్థమవుతుంది. సుమారు 178-179 గజాల పరిమితిలో ఉండగా, నివాస అవసరాల కోసం ‘స్తంభాలపై నిర్మించే రెండు అంతస్తుల’ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు వేరువేరుగా అనుమతులు మంజూరు చేశారు.
అనుమతి పత్రాలను సాకుగా చూపి, నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ఏకంగా ‘భూగర్భ అంతస్తు G ఏడు అంతస్తుల’ భవనాన్ని, రెండు అనుమతుల విస్తీర్ణాన్ని కలిపి నిర్మిస్తున్నారు. నివాస గృహంగా అనుమతులు పొంది, నేల అంతస్తులో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేయడం ద్వారా నివాస ప్రాంతాన్ని పూర్తిగా వ్యాపార కేంద్రంగా మార్చేశారు.

చట్టం ఏం చెబుతోంది? : హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955 ప్రకారం, ఆమోదించిన ప్లాన్‌కు భిన్నంగా చేపట్టిన ప్రతి నిర్మాణం నేరమే..
అనుమతి పొందిన ప్లాన్ కంటే అదనపు అంతస్తులను నిర్మించడం చట్టవిరుద్ధం.
జోనింగ్ ఉల్లంఘన : నివాస అవసరాల కోసం కేటాయించిన భూమిలో వ్యాపార సముదాయాలను నిర్మించడం నిబంధనలకు విరుద్ధం.
అధికారుల బాధ్యత : క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన నగర ప్రణాళికా సిబ్బంది, స్వార్థ ప్రయోజనాలకు ఆశపడి ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం తీవ్రమైన నేరం. మున్సిపల్ కమిషనర్‌కు ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పూర్తి అధికారం ఉంటుంది.
ప్రజా వ్యతిరేకత.. అధికారుల మౌనం : ఈ భారీ అక్రమ కట్ట డాలు జరుగుతున్నా, సంబంధిత అధికారులు మౌనంగా ఉండ టం స్థానికులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. సామాన్యుల నుంచి పన్నులు వసూలు చేస్తూ, అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
తక్షణమే చేపట్టాల్సిన చర్యలు : గోల్కొండ ప్రాంతీయ కార్యాలయం మరియు కార్వాన్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తున్న అధికారుల అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి. నిబంధనలను ఉల్లంఘించిన నిర్మాణదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు, ఆమోదించిన ప్లాన్ దాటి నిర్మించిన అదనపు అంతస్తులను తక్షణమే కూల్చివేయాలి. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా లేక నిబంధనలను గాలికి వదిలేస్తారా అనేది వేచి చూడాలి.
