Homeఆదాబ్ ప్రత్యేకంTribal Land Rights | అడవి బిడ్డల భూములపై ఆధిపత్యమెవరిది..?

Tribal Land Rights | అడవి బిడ్డల భూములపై ఆధిపత్యమెవరిది..?

  • గిరిజన భూములపై పంజా విసిరిన మంత్రి సన్నిహితులు
  • పామాయిల్ సాగు పేరుతో దళితుల భూములకు ఎసరు
  • వారసులం అంటూ సుప్రీంకు వెళ్లిన అగ్రకులాల వారు
  • తమ పేరుమీద భూ బదలాయింపు చేయాలని పిటిషన్
  • మంత్రి, అనుచరులపై విచారణ జరపాలంటూ డిమాండ్స్
  • నిజా నిజాలు ప్రపంచానికి తెలియాలి : గిరిజన సంఘాలు

అధికార బలంతో అమాయకుల గొంతు కోస్తున్నారా? అండదండలున్న ఆ అగ్రకులాల కన్ను ఇప్పుడు దళితులు, గిరిజనుల పొలాలపై పడిందా? ‘పామాయిల్ సాగు’ ముసుగులో పేదల భూములను కాజేయడానికి జరుగుతున్న ఈ భారీ కుట్ర వెనుక అసలు సూత్రధారులు ఎవరూ? మంత్రి సన్నిహితుల అరాచకాలపై గిరిజన సంఘాలు యుద్ధభేరి మోగిస్తున్న వేళ, ఈ భూకబ్జా బండారం వెనుక నిజా నిజాలేమిటి? దళితుల హక్కులను కాలరాస్తున్న ఈ చీకటి ఒప్పందాలపై ఆదాబ్ హైదరాబాద్ 2వ కథనం..

గిరిజనుల భూములకు రక్షణగా నిలవాల్సిన చట్టాలే అమలుకు నోచుకోకపోతే వారి హక్కులకు దిక్కెవరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో భూకబ్జాలు, అక్రమ సాగు ఆరోపణలు, సర్వే రికార్డుల గందరగోళం గిరిజనుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరుగుతున్న దమనకాండతో గిరిజనులు విలవిలలాడి పోతున్నారు.. ఈ క్రమంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని దమ్మపేట, గనుగులపల్లి, నాగుపల్లి గ్రామాల్లో ఈ అక్రమం జరుగుతోంది.. వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన 1/70 చట్టం ఖమ్మం జిల్లా ఏజెన్సీలో కేవలం కాగితాలకే పరిమితమైందా..? అనే తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా ఉన్న భూముల వ్యవహారంలో ఓ రాష్ట్ర మంత్రి, ఇతర రాజకీయ ప్రముఖులకు సంబంధించిన భూములపై కూడా అనుమానాలు ఉన్నాయని ఖమ్మం జిల్లాలోని గిరిజన నాయకులు ఆరోపించారు.

కొన్ని భూములు మంత్రి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నాయనే సమాచారం తమకు ఉందని, గిరిజన భూముల(Tribal Land Rights) మధ్యలో ఉన్న భూముల యాజమాన్యం, సాగు వివరాలు పరిశీలించాలని డిమాండ్ చేశారు. అలాగే, గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినవారు, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారు భూములు కొనుగోలు చేయడం లేదా సాగు చేయడం వంటి అంశాలపై కూడా చట్టప్రకారం విచారణ జరగాలని కోరారు. అయితే, వ్యక్తుల పేర్లపై ఉన్న భూములు గిరిజన భూములేనా? వాటి కొనుగోలు, స్వాధీనం చట్టబద్ధమైనవేనా? అన్నది రికార్డుల పరిశీలనతోనే నిర్ధారణ కావాలి. ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సర్వే రికార్డులపై అనుమానాలు :

ప్రభుత్వం భూముల వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేసే ప్రక్రియ చేపడితే, ఇప్పటికే వివాదాల్లో ఉన్న భూముల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అంటున్నారు.. చుట్టూ పెద్ద విస్తీర్ణంలో ఒకరి ఆధీనంలో భూములు ఉండి, మధ్యలో చిన్నచిన్న గిరిజన భూములు(Tribal Land Rights) ఉన్నప్పుడు వాటి హద్దులు, సర్వే నంబర్లు, పాత రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మేధావులు సూచిస్తున్నారు.. సాటిలైట్ సర్వే లేదా డిజిటల్ భూ రికార్డుల నవీకరణలో భూమి వాస్తవ యజమానుల హక్కులు దెబ్బతినకూడదు..

కేవలం ప్రస్తుతం ఎవరి ఆధీనంలో భూమి ఉందనే అంశం ఆధారంగా కాకుండా, పాత రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, సర్వే వివరాలు, చట్టబద్ధమైన బదలాయింపులను పరిశీలించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.. భూమి రికార్డుల్లో తేడాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సరిచేయాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వాధికారులపై వుంది..

ఐటీడీఏ, రెవెన్యూ అధికారుల బాధ్యత ఏమిటి?

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖతో పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.. ఏజెన్సీ గ్రామాల్లో సాగులో ఉన్న భూముల వివరాలు, కౌలు ఒప్పందాలు, పంటల సాగు, భూముల యాజమాన్యంపై అధికారులు నివేదికలు రూపొందించాల్సి ఉంటుంది..

ఏయే గ్రామాల్లో ఎంత విస్తీర్ణంలో గిరిజనుల భూములు ఇతరుల సాగులో ఉన్నాయి? వాటికి సంబంధించిన ఒప్పందాలు చట్టబద్ధమైనవేనా? గిరిజన రైతులకు ఎంత ఆదాయం అందుతోంది? అనే అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలి.. భూముల వివాదాలు ఉన్న గ్రామాలను అధికారులు సందర్శించి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలి.. అవసరమైతే ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేయాలి.. గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి, సాగుకు అవసరమైన వనరులు, నీటి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే..

పోడు భూముల విషయంలోనూ సమస్యలే! :

గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అటవీ భూముల్లో సాగు చేసుకున్న గిరిజన కుటుంబాలకు అటవీ హక్కుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా కొందరికి పట్టాలు వచ్చినప్పటికీ, ఇంకా అనేక కుటుంబాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని వారు అంటున్నారు..

2005కు ముందే గిరిజనులు సాగు చేసుకున్న భూముల్లో మొక్కలు నాటి వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి.. అయినప్పటికీ ఆ భూముల వినియోగంపై స్పష్టత కానరావడం లేదు.. మరోవైపు కొందరు పెద్దలు అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న భూముల్లో బోర్లు వేసి సాగు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వున్నాయి.. అటవీ భూములు, పోడు భూములు, రెవెన్యూ భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి, చట్టబద్ధమైన హక్కులు ఉన్నవారికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు..

1/70 చట్టం మార్పులపై ఆందోళన :

గిరిజన ప్రాంతాల్లో భూముల రక్షణకు సంబంధించిన 1/70 చట్టం విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఈ చట్టానికి వ్యతిరేకంగా లేదా దాని అమలులో మార్పుల కోసం న్యాయపరమైన చర్యలు చేపడుతున్నారనే సమాచారం తమకు ఉందని వారు అంటున్నారు.. ఈ చట్టాన్ని తొలగించడం లేదా సవరించడం సాధ్యమయ్యే రాజ్యాంగ, చట్టపరమైన ప్రక్రియ ఏమిటన్నది న్యాయ నిపుణులు, ప్రభుత్వ అధికారులు స్పష్టం చేయాలని కోరుతున్నారు..

సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలోని అభ్యర్థనలు, వాటిపై వెలువడిన ఉత్తర్వులను అధికారికంగా పరిశీలించి ప్రజలకు వివరించాలని వారు కోరుతున్నారు.. వారికి తెలిసిన వివరాల ప్రకారం, చట్టానికి మద్దతుగా గిరిజన సంఘాల తరఫున కూడా సంతకాల సేకరణ చేపట్టామని, సుమారు 2,500 మంది పేర్లతో ఒక దరఖాస్తును సమర్పించామని, మరో 500 మంది పేర్లతో పత్రాలు సిద్ధంగా ఉన్నాయని గిరిజన సంఘాల నాయకులు వెల్లడించారు. చట్టాన్ని పరిరక్షించుకు నేందుకు న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

తేలాల్సిన ప్రశ్నలెన్నో!

దమ్మపేట, అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన భూములపై వస్తున్న ఆరోపణలు అనేక ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. భూముల అసలు యజమానులు ఎవరు? గిరిజనుల నుంచి ఇతరులకు భూముల బదలాయింపు జరిగిందా? కౌలు ఒప్పందాలు చట్టబద్ధమైనవేనా? ఆయిల్‌పామ్ తోటల విస్తరణలో గిరిజన భూములు కలిసిపోయాయా? రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల మధ్య తేడాలున్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే ప్రభుత్వం సమగ్ర భూ సర్వే నిర్వహించి, పాత రికార్డులను పరిశీలించి, బాధిత గిరిజనుల వాదనలు వినాలి.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వివరణలతో పాటు సంబంధిత అధికారుల నివేదికలను కూడా ప్రజల ముందుంచాలి. గిరిజన భూములకు రక్షణ కల్పించాల్సిన చట్టాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? భూముల వివాదాల వెనుక ఉన్న వాస్తవాలేమిటి? అన్నది ప్రభుత్వ విచారణతోనే తేలాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News