- కారుణ్య నియామకం ముసుగులో భారీ అవినీతి..!
- రిటైర్మెంట్ తర్వాత మృతి చెందిన ఉద్యోగి మరణ తేదీ తారుమారు..
- సూర్యాపేటలో మరణం.. నల్గొండలో నకిలీ డెత్ సర్టిఫికెట్..
- నకిలీ ధృవీకరణ పత్రం(Fake Certificate Scam) వెనుక అధికారుల పాత్రపై అనుమానాలు..
- ముడుపులు తీసుకొని ఫైల్‌కు ఆమోదం తెలిపారన్న ఆరోపణలు..
- వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాసంఘాల డిమాండ్..
ఉద్యోగ విరమణ పొందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తర్వాత అనారోగ్యంతో సూర్యాపేటలో మృతి చెందితే, ఆయన మరణ తేదీని తారుమారు చేసి ఏకంగా కారుణ్య ఉద్యో గం పొందిన వైనం కలకలం రేపుతోంది. సూర్యాపేటలో మరణించిన సదరు ఉద్యోగికి నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అండదండలతో నకిలీ మరణ ధృవీకరణ పత్రం(Fake Death Certificate Scam) సృష్టించి ఈ భారీ అక్రమ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రముఖ ‘ఆదాబ్ హైదరాబాద’ సేకరించిన పక్కా ఆధారాల ప్రకారం ఈ దారుణ మోసానికి సంబంధించిన పూర్తి వార్తా కథనం క్రింది విధంగా ఉంది.

సంఘటన నేపథ్యం : చామకూరి వెంకటేశ్వర్లు (వయస్సు: 61, పుట్టిన తేదీ: 08-05-1964) 2003 మే 29న కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. షాలి గౌరారం, మాదారం (కలాన్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్లలో సుమారు 23 ఏళ్ల పాటు సేవలందించిన ఆయనను, గత ప్రభుత్వ హయాంలో 2023 మే 26న క్రమబద్ధీకరించారు. నిజమైన పదవీ విరమణ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన సర్వీస్ కాలం ముగియడంతో 31-05-2025 నాటికి ఉద్యోగ విరమణ పొందారు.
సూర్యాపేటలో అసలు మరణం : కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు సూర్యాపేటలో నవంబర్ 26, 2025న కన్నుమూశారు. ఆయన చనిపోయిన రోజు మరియు దశదినకర్మకు కుటుంబ సభ్యులు భారీ ఎత్తున బ్యానర్లు కట్టి నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, పోస్టర్లు స్పష్టమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఎలా జరిగిందీ నకిలీ నాటకం..? : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగ సర్వీస్ లో ఉంటూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మాత్రమే కారుణ్య నియామకం వర్తిస్తుంది. కానీ, వెంకటేశ్వర్లు మే 2025లోనే రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత నవంబర్ 2025లో సూర్యాపేటలో మృతి చెందడంతో నిబంధనల ప్రకారం కుటుంబానికి కారుణ్య ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. దీంతో కుటుంబ సభ్యులు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. సూర్యాపేటలో మరణిం చినప్పటికీ, ఆన్లైన్ ధృవీకరణ పత్రాన్ని పక్కనపెట్టి… నల్గొండ జిల్లా వైద్యశాఖ అధికారులతో కుమ్మక్కై నల్గొండ జిల్లాలో మ్యాన్యువల్‌గా 28-05-2025 తేదీతో వెంకటేశ్వర్లు మరణించినట్లు నకిలీ మరణధృవీకరణ పత్రం సృష్టించారు.
అటెండర్‌గా అక్రమ పోస్టింగ్ : నల్గొండ జిల్లాలో సృష్టించిన నకిలీ డెత్ సర్టిఫికెట్ ఆధారంగా, వెంకటేశ్వర్లు కుమారుడు చామకూరి రాజును నల్గొండ జిల్లా దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటెండర్‌గా అక్రమంగా కారుణ్య నియామకం కల్పించి విధులు కేటాయించారు.

లంచాలు – ముడుపుల దందా : ఈ మొత్తం కుంభకోణం వెనుక నల్గొండ జిల్లా వైద్య శాఖ కార్యాలయానికి చెందిన కొందరు కీలక అధికారులు ముఖ్యపాత్ర పోషించారు. ముఖ్యంగా సీసీ రంజిత్ కుమార్, జిల్లా వైద్య శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ భారీ ఎత్తున ముడుపులు దండుకొని, ఈ నకిలీ ఫైల్‌కు అప్రూవల్ ఇప్పించడంలో కీలక సహాయ సహకారాలు అందించారని విశ్వసనీయ సమాచారం.
సమగ్ర విచారణ కోరుతున్న ప్రజానీకం : సూర్యాపేటలో మృతి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి, నల్గొండ జిల్లాలో నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి ప్రభుత్వ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవడం వైద్య శాఖలో పరాకాష్టకు చేరిన అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. అర్హులైన నిరుద్యోగులకు దక్కాల్సిన కారుణ్య ఉద్యోగాన్ని అక్రమ మార్గంలో కొల్లగొట్టిన ఈ ఘటనపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధి కారులు సుమోటోగా స్పందించి సమగ్ర విచారణ జరపాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విచారణలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే నల్గొండ జిల్లా వైద్యశాఖలో మరిన్ని అక్రమాలు, తెరవెనుక సూత్రధారుల బండారం బయటపడే అవకాశం ఉంది. ?“మా అక్షరం అవినీతిపై అస్త్రం” నినాదంతో ముందుకు వెళ్తున్న ఆదాబ్ హైదరాబాద్ ఈ అవినీతి బాగోతానికి సంబంధించిన మరిన్ని సంచలన నిజాలను, ఆధారాలను రాబోయే కథనంలో వెల్లడించనుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
