Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | టాప్ ర్యాంకుల అవినీతిపరులు..

Corruption | టాప్ ర్యాంకుల అవినీతిపరులు..

వందల కోట్ల అక్రమ సంపాదన..
తెలంగాణ అవినీతి ‘టాపర్ల’ చిట్టా..

  • ఆశ్చర్యానికి గురిచేస్తున్న అక్రమార్కుల హిస్టరీ..
  • సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచావతారాలు..
  • రెండు నెలల వ్యవధిలో అంతులేని అవినీతి..
  • ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ఎంతో..
  • ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం

నారాయణ, శ్రీ చైతన్య సంస్థలు ర్యాంకుల ప్రకటనలు ఇస్తే అబ్బా అనుకుంటాం. కానీ, తెలంగాణలో ఇప్పుడు అంతకంటే ఘనమైన ‘అవినీతి ర్యాంకుల’ పరంపర నడుస్తోంది! చదువుకునే పిల్లలు రాత్రింబవళ్లు కష్టపడి మార్కులు సాధిస్తే.. మన పన్నుల డబ్బుతో జీతాలు తీసుకునే కొందరు అధికారులు మాత్రం ‘లంచాల మార్కులతో’ వందల కోట్ల అక్రమాస్తుల ర్యాంకులు కొడుతున్నారు. ఒక సామాన్యుడు నెల జీతం కోసం రోజుకు 9 గంటలు గొడ్డుచాకిరీ చేస్తుంటే.. కేవలం ఈ మే, జూన్ నెలల్లోనే ఏసీబీకి దొరికిన ఒక ఐదుగురు ‘టాప్ టాపర్స’ సంపాదన చూస్తే గుండె ఆగిపోవాల్సిందే. ఆ నయా నవాబుల నల్లధనం చిట్టా మీకోసం అందిస్తోంది ఆదాబ్ హైదరాబాద్..

- Advertisement -

వ్యవస్థను మింగేస్తున్న తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. సామాన్యుడి రక్తం కూడు.. అవినీతి అధికారుల నోట్ల పడకలు! డ్యాష్ బోర్డులపై కోట్లు, పరుపుల కింద కట్టలు, లాకర్లలో బంగారు గనులు.. ఇదీ ఇటీవల తెలంగాణలో ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న నగ్న సత్యం. డీఎస్పీ భీమరెడ్డి, సుంకర నరహరిరావు, మోహన్ నాయక్, భుజంగరావు, అనంత లక్ష్మీ కుమార్, జలమండలి జీఎం, ఈఎన్‌సీ, ఏఎస్పీ.. ఇలా ఒకరా ఇద్దరా? పేర్లు మారొచ్చు, హోదాలు మారొచ్చు.. కానీ సామాన్యు డిని దోచుకునే నైజం మాత్రం ఒక్కటే. ప్రభుత్వ జీతం తీసు కుంటూ, ప్రజా సేవ చేయాల్సిన వీరు వందల కోట్ల అక్రమా స్తులు ఎలా కూడబెట్టారు? ఐదుగురు అధికారుల ఇళ్లలోనే కోట్ల నోట్ల కట్టలు మూలుగుతుంటే, ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా అవినీతి పరుల దగ్గర ఇంకెంత నల్లధనం దాగి ఉందో ఊహించుకుంటేనే సామాన్యుడికి వెన్నులో వణుకు పుడుతోంది.

ఒకవైపు రెక్కాడితే గానీ డొక్కాడక, నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లడమే గగనమై, పస్తులుంటూ కాలం గడుపుతున్న సామా న్యులు. మరోవైపు ప్రజల సొమ్మును జేబుల్లో వేసుకుని విలాస వంతమైన జీవితాలు గడుపుతున్న దుర్మార్గులు. ప్రజల పన్నుల రూపంలో, పైసా పైసా కష్టపడి కూడబెట్టిన సొమ్ము అభివృద్ధి పనులకు చేరడం లేదు. అది నేరుగా ఈ అవినీతి అధికారుల జేబుల్లోకి, వారి వెనుక ఉన్న పెద్దల ఖాతాల్లోకి వెళ్తోంది. సామాన్యుడి రక్తాన్ని పిండి, దొరలకు దోచిపెడుతూ, సమాజంలో అంతరాలను పెంచుతున్నారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి వద్ద ఎంత నగదు ఉండాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, కోట్ల రూపాయలను ఇళ్లలో ఎలా దాచగలుగుతున్నారు?

అందరూ ఇంతింత డబ్బులు దాచుకుంటూ పోతే, ఏ అండాలేని సామాన్యుడి బతుకు మారేది ఎప్పుడు? పేదలకు న్యాయం జరిగేది ఎన్నడు? సమాజం ఎటుపోతోంది? అవినీతిని అరికట్టా ల్సిన వాళ్లే అవినీతికి వంత పాడుతుంటే ఇక రక్షించేది ఎవరు? ఈరోజు ఏసీబీకి పట్టుబడతారు, రేపు సస్పెండ్ అవుతారు.. కొన్ని నెలలు తిరక్కుండానే కోర్టు లొసుగులను వాడుకుని స్టేలు తెచ్చు కుంటారు. మళ్లీ అదే కుర్చీలో కూర్చుని, అంతకుమించి రెచ్చి పోయి లంచాలు గుంజుతారు.

ఇదా వ్యవస్థ? ప్రభుత్వాలు సైతం కఠినంగా వ్యవహరించకుండా ఇటువంటి వారికి పరోక్షంగా మద్దతుగా నిలుస్తుంటే పేదవాడు ఎవరికి చెప్పుకోవాలి? కేవలం సస్పెన్షన్లు, బదిలీలతో ఈ అవినీతి క్యాన్సర్‌ను నయం చేయలేం. వ్యవస్థలో సమూల మార్పులు రావాలి.. అవినీతి ఆరో పణలు రుజువైన అధికారులను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిం చాలి. ఎలాంటి పెన్షన్, ప్రభుత్వ ప్రయోజనాలు అంద కుండా చేయాలి. అక్రమంగాసంపాదించిన ప్రతిపైసాను, ఆస్తులను ప్రభు త్వం స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలి.

లంచం అడగాలన్నా, అవినీతి చేయాలన్నా గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా, గజగజా వణకిపోయేలా విచారణా కాల పరిమితితో కూడిన కఠినమైన ప్రత్యేక చట్టాలు రావాలి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. దోపిడీదారుల ఆటలు సాగనివ్వకూడదు. ఈ అవినీతి తిమింగలాలకు బుద్ధి చెప్పి, సామాన్యుడి బతుకుల్లో వెలుగులు నింపే రోజు కోసం ప్రతి ఒక్కరూ చేయీ చేయీ, గొంతు కలపాల్సిన సమయం ఆసన్నమైంది!

కార్పొరేట్ కాలేజీలు స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు ప్రకటిస్తే జనం ఆశ్చర్యంగా చూస్తారు. కానీ, ఈ మధ్య కాలంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖకి దొరికిన కొందరు ప్రభుత్వ అధికారుల ‘అవినీతి ర్యాంకులు’ చూస్తే సామాన్యుడి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఇక్కడ ర్యాంకులు అంటే మార్కులు కావు… వందల కోట్ల అక్రమాస్తులు. ఒక సామాన్య యువకుడు బీటెక్, ఎంటెక్ నెలంతా కష్టపడి రూ. 30 వేలు సంపాదించడానికి నానా అవస్థలు పడుతుంటే.. మనం కట్టే పన్నులతో జీతాలు తీసుకునే కొందరు అధికారులు మాత్రం ప్రభుత్వానికి పట్టిన పందికొక్కుల్లా, జలగల్లా ప్రజాధనాన్ని జుర్రేస్తున్నారు. కేవలం ఈ మే, జూన్ మాసాల్లోనే ఏసీబీ వలలో చిక్కిన ‘టాప్-5 అవినీతి టాపర్ల’ నమ్మశక్యం కాని, షాకింగ్ నిజాలు ఇవి.. అవినీతిలో మొదటి 5 ర్యాంకుల్లో ఉన్న ప్రబుద్దుల చిట్టా ఇప్పుడు చూద్దాం..

ర్యాంకర్ నెంబర్ వన్ : డీఎస్పీ భీంరెడ్డి
(అంచనా ఆస్తులు: రూ. 200 కోట్లు)

Top corrupt Telangana officials ACB raids1

ఒక సాధారణ కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించి, ఎసఐగా మారి, డీఎస్పీ హోదాకు ఎదిగిన భీమరెడ్డి అవినీతిలో ‘నెంబర్ వన’ ర్యాంక్ సాధించారు.

ర్యాంకర్ నెంబర్ టూ : సుంకర నరహరిరావు
(అంచనా ఆస్తులు: రూ. 200 కోట్లు)

Top corrupt Telangana officials ACB raids2

ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన నరహరిరావు ఆస్తులు ఏసీబీ చరిత్రలోనే అతిపెద్దవని చెప్తున్నారు. భూముల వివాదాలు, కబ్జాదారులకు మద్దతుగా పేదోడి భూములను ధనవంతుల పేరిట మార్చడమే ఈయన పని.

ర్యాంకర్ నెంబర్ త్రీ : మోహన్ నాయక్,
ఈఎన్‌సీ (అంచనా ఆస్తులు: రూ.200 కోట్లు)

Top corrupt Telangana officials ACB raids3

రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అయిన మోహన్ నాయక్ రోడ్ల కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిబంధనలు మార్చి కోట్లు వెనకేశారు.
కమిషన్ ప్యాకేజీ : ఎంతటి వారైనా సరే.. ‘చేయి తడిపితేనే’ సంతకాలు, బిల్లుల విడుదల చేసేవారట.

ర్యాంకర్ నెంబర్ ఫోర్ : భుజంగరావు,
ఏఎస్పీ (అంచనా ఆస్తులు: రూ.100 కోట్లు)

Top corrupt Telangana officials ACB raids0

తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడై సస్పెండ్ అయిన భుజంగరావు ఇటు అవినీతిలోనూ టాపరే. కాకీ యూనిఫామ్‌ను అడ్డం పెట్టుకొని వంద కోట్లు కూడబెట్టారు.
ట్యాపింగ్ అక్రమాలు : ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొందరి వ్యక్తిగత జీవితాలను బ్లాక్ మెయిల్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి.

ర్యాంకర్ నెంబర్ ఫైవ్ : అనంత లక్ష్మీ కుమార్,
జలమండలి జీఎం (అంచనా ఆస్తులు: రూ. 100 కోట్లు)

Top corrupt Telangana officials ACB raids

హైదరాబాద్ జలమండలి (రెడ్ హిల్స్) జనరల్ మేనేజర్‌గా పనిచేసిన లక్ష్మీ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు నోట్లు లెక్కించలేక ‘కౌంటింగ్ మెషీన్లు’ తెప్పించాల్సి వచ్చింది.
ట్యాంకర్ల దందా : రోజుకు కనీసం రూ. 50 వేల లంచం తీసుకోకుండా ఈయన ఇంటికి వెళ్ళేవారు కారట. హైదరాబాద్ లో వాటర్ ట్యాంకర్లకు నీళ్ళు నింపాలంటే ఒక్కో ట్యాంకర్‌కు రూ. 5000 వసూలు చేసే ఘనుడు.

ఓ సామాన్యుడా.. మేలుకో :

వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే అధికారులు ఎందరో ఉన్నారు. వారికి సెల్యూట్..కానీ, ఇలాంటి కొద్దిమంది అవినీతి జలగల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. ఈ ఐదుగురే కాదు.. ఇంకా దొరకాల్సిన పందికొక్కులు ఎన్నో ఉన్నాయి. దయచేసి ఇది గమనించండి ఎవరైనా లంచం అడిగితే తలవంచకండి, లంచం ఇవ్వకండి. వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు సమా చారం ఇవ్వండి. అవినీతి రహిత సమాజం కోసం సామాన్యుడు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించండి.. మరో ముఖ్యమైన విషయం..

ఏసీబీ దాడుల్లో బయటపడ్డ అవినీతి సొమ్ము అధికారులే స్వయంగా జనాలకు చూపిస్తున్నారు.. వివిధ సోషల్ మీడియా వేదికలద్వారా ప్రజల చెంతకు చేరుతోంది.. అయినా మార్పు రావడంలేదు.. ఇదే దరిద్రం.. గత బీ.ఆర్.ఎస్. ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు.. దాచుకున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బడా బడా తిమింగలాలనే గేలం వేసి పట్టుకుంటున్నారు.. చీమల పుట్ట పగిలినట్లు అవినీతిపరులు బయటపడుతున్నారు.. కేవలం ఇది ఆదాబ్ పాఠకులకు మేము అందిస్తున్న ట్రైలర్ మాత్రమే.. మరిన్ని అవినీతి కథనాలను వరుసగా అందించనుంది

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News