- మొత్తం 18,000 శ్లోకాలతో గరుడ పురాణం..
- ఎవరైనా చనిపోయిన ఇంట్లో పారాయణం చేస్తారు..
అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీమహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి బోధించిన వైష్ణవ పురాణమే గరుడ పురాణం. ఇందులో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు చేయాల్సిన కర్మలు, ఆచారాల గురించి ఇందులో వివరించబడింది. గరుడ పురాణం ఎక్కువగా మరణానంతర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండడం చేత మిగిలిన పురాణాల మాదిరిగా ఈ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ అంశంపై మరింత సమగ్రంగా తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే!
వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఈ గరుడ పురాణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, తాము చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో వివరించబడింది. అంతేకాదు మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనే పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయని పండితులు చెబుతారు. మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే వివరాలను కూడా పొందుపరిచారు.
గరుడ పురాణం పేరుకు పురాణం అయినప్పటికీ మిగతా పురాణాలు చదివినంత తేలికగా, ఆసక్తిగా గరుడ పురాణం చదవడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడ పురాణం పట్ల ప్రచారంలో ఉన్న అపోహలే అని చెప్పవచ్చు. ఈ పురాణం లోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. పురాణాల ప్రకారం, గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యుల మరణం తర్వాత మాత్రమే పారాయణ చేస్తారు. చనిపోయిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో గరుడ పురాణం చదవం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు.
