Sunday, June 28, 2026
HomeజాతీయంInsurance | బీమా చైతన్యం…భవితకు ఆత్మ విశ్వాసం

Insurance | బీమా చైతన్యం…భవితకు ఆత్మ విశ్వాసం

  • జూన్ 28…నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ డే

ప్రతి సంవత్సరం జూన్ 28న నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ డేను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా బీమా రంగంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయి. ఈ ప్రత్యేక దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో బీమా యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పడం, భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం బీమా అవసరాన్ని తెలియ జేయడం. అనిశ్చితతలతో నిండిన ఆధునిక జీవన విధానంలో బీమా ఒక ఆర్థిక సాధనంగా కాకుండా, కుటుంబాన్ని కాపాడే రక్షణ కవచంగా, మనసుకు భరోసానిచ్చే ఆశాజ్యోతిగా మారింది.

బీమా అనేది భవిష్యత్తులో సంభవించే నష్టాలను, ప్రమాదాలను ఎదుర్కొనడానికి ఆర్థిక భద్రతను కల్పించే విధానము. బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి నిర్దిష్టమైన మొత్తం ప్రీమియంగా చెల్లిస్తే, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం బీమా సంస్థ ఆర్థిక పరిహారం అందిస్తుంది. ఇది వ్యక్తిగత స్థాయిలోనే కాదు, కుటుంబం, వ్యవసాయం, వాహనం, ఆస్తి వంటి అనేక రంగాల్లో రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ ఆర్థిక నష్టం జరిగినా, అది వ్యక్తి జీవన ప్రమాణాన్ని పూర్తిగా కూల్చి వేయకుండా అడ్డుకుంటుంది.

- Advertisement -

బీమాపై సరైన అవగాహన లేని ప్రజల శాతం భారత దేశంలో ఇంకా అధికంగానే ఉంది. కొందరికి ఇది అవసరం లేదనిపిస్తుంది, మరికొందరికి ఖర్చు లాగా అనిపిస్తుంది. కొంతమంది బీమా పాలసీ తీసుకున్నా, దాని ప్రయోజనాలు ఎలా పొందాలో తెలియదు. ఈ నేపథ్యంలో బీమా అవగాహన దినోత్సవం అత్యంత ప్రాధాన్యంతో కూడుకున్నదిగా నిలుస్తోంది. ఈ రోజును పురస్కరించుకుని ప్రజలకు బీమా రకాలు, వాటి ప్రయోజనాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఎలా నష్టపరిహారం పొందాలో వంటి అంశాలపై వివరంగా తెలియ జేయడం జరుగుతుంది.

మన జీవితాల్లో అనేక అప్రమత్తతలు ఉండవలసిన అవసరం ఉంది. అనారోగ్యం, ప్రమాదం, పంట నష్టం, వాహన ప్రమాదం, ప్రకృతి విపత్తులు వంటి అనేక సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. ఇవి వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో ఆర్థిక భారం ఎదురవుతుంది. అలాంటి సమయంలో బీమా ఉండటం వల్ల ఆ భారాన్ని స్వల్పంగా చేయవచ్చు. ఉదాహరణకు, ఓ చిన్న ఆరోగ్య సమస్యకు ఆసుపత్రి ఖర్చు లక్షల్లో చేరుతున్న తరుణంలో ఆరోగ్య బీమా ఉండటం ఎంతో ఉపశమనంగా మారుతుంది. అలాగే, కుటుంబ పోషకుడు అకస్మాత్తుగా మృతి చెందితే జీవిత బీమా వల్ల కుటుంబానికి ఆర్థికంగా కుంగిపోకుండా ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది.

బీమా సేవల పరిధి రోజు రోజుకూ విస్తరిస్తున్నప్పటికీ, అందుబాటులో ఉన్న అన్ని రకాల బీమాలను ప్రజలు తెలుసుకోవడం ముఖ్యం. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా, గృహ బీమా, ప్రయాణ బీమా, పంట బీమా వంటి అనేక బీమా రకాలున్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేక అవసరాలను తీర్చేందుకు రూపొందించ బడ్డది. ప్రతి వ్యక్తి తన అవసరాన్ని బట్టి సరైన పాలసీ ఎంచుకోవాలి. ఇది కేవలం బీమా సంస్థల పక్కనుండి వెళ్లిపోవడం కాదు; భవిష్యత్తు కోసం ముందస్తుగా వేసే భద్రతా అడుగు.

బీమా రంగం భారత దేశంలో రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. 1818లో ప్రారంభమైన ఈ రంగం 1956లో జీవ సంస్థలన్నింటినీ ఏకీకృతంగా “భారత జీవిత బీమా సంస్థ”గా కలపడం ద్వారా పునర్‌ వ్యవస్థీకృతమైంది. 1999లో బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ఏర్పడి, ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడంతో బీమా మరింత విస్తృతమైంది. ప్రస్తుతం భారత జీవ బీమా సంస్థ, హెచ్.డి.ఎఫ్.సీ జీవ బీమా, ఎస్.బి.ఐ జీవ బీమా, ఐ.సి.ఐ.సి.ఐ ప్రమాద బీమా, న్యూ ఇండియా అష్యూరెన్స్ వంటి సంస్థలు ప్రజలకు విశ్వసనీయంగా సేవలందిస్తున్నాయి.

ప్రభుత్వం కూడా సామాన్యులకు బీమా అందుబాటులో ఉండేలా అనేక ప్రజా పథకాలను అమలు చేస్తోంది. అందులో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు ప్రజలకు తక్కువ ఖర్చుతో గరిష్ట ప్రయోజనం అందించేలా రూపొందించ బడ్డాయి. ఇవి ప్రత్యేకించి నిరుపేదలకు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి, గ్రామీణ జనాభాకు అండగా నిలుస్తున్నాయి.

ఇన్నాళ్లూ సంప్రదాయ పద్ధతుల్లో కొనుగోలు చేసిన బీమా ఇప్పుడు తంత్ర జ్ఞాన ఆధారిత రూపాన్ని సంతరించుకుంది. ఆధార్ ఆధారిత ధృవీకరణతో, చేతి ఫోనులో నుంచే పాలసీలు కొనుగోలు చేయడం, నష్టపరిహారం పొందడం సులభమైంది. పాలసీ బజార్, డిజిట్, ఆకో వంటి మాధ్యమాల ద్వారా బీమా తీసుకోవడం ఎంతో వేగవంతమైన ప్రక్రియగా మారింది. ఇవి కొత్త తరానికి వినూత్నమైన అవకాశం.

బీమా ఉండటం ఎంత ముఖ్యమో, దానిని సక్రమంగా ఉపయోగించు కోవడమూ అంతే ముఖ్యం. పాలసీ నిబంధనలు పూర్తిగా చదవడం, అవసరమైన ఆధారాలు సమకూర్చు కోవడం, ప్రమాదం జరిగిన వెంటనే సంస్థకు సమాచారం ఇవ్వడం వంటి అంశాలు ప్రతీ పాలసీ దారుడికి తెలియాలి. అప్పుడే నష్ట పరిహారం పొందే ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా ప్రయోజనం పొందవచ్చు.

ఈ నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ డే మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది – బీమా ఉండటం అనేది శుభ సూచకం. అది భయానికి కాదు, భరోసాకు సంకేతం. అది వ్యయానికి కాదు, సంక్షేమానికి సూచిక. మన జీవితంలో ఒక్క అవకాశం తప్పితే జీవితం మారిపోతుంది. అలాంటి సంధిలో బీమా మన కుటుంబానికి నమ్మకమైన నీడలాంటిది.

ఈరోజు మనకు ఆదర్శనంగా ఉండాలి. మన కుటుంబం భవిష్యత్తు కోసం, మన పిల్లల భద్రత కోసం, అనుకోని సంఘటనల్లో ఆర్థిక పరంగా వెనుక పడకుండా ఉండేందుకు బీమా తీసుకోవడం మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరూ కనీసం ఒక జీవ బీమా లేదా ఆరోగ్య బీమా పాలసీతో తమ భవిష్యత్తును భద్ర పర్చుకోవాలి. అదే నిజమైన తెలివైన నిర్ణయం.

బీమా లేదు అంటే భద్రతా లేదు. బీమా ఉన్న చోటే భరోసా ఉంటుంది. కనుక ఈరోజే బీమా గురించి తెలుసుకోండి. మీ అవసరానికి తగిన పాలసీ ఎంచుకోండి. మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా, సంతోషంగా గడపండి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News