- హితవు పలికిన పవన్ కళ్యాణ్..
- క్రిమినల్స్ కు కులం రంగు పులుముతున్నారు..
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుల రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్థులకు, క్రిమినల్స్‌కు కులం రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందాలని చూసే సంస్కృతిని తీవ్రంగా ఖండించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును ప్రస్తావిస్తూ.. 14 ఏళ్ల అమ్మాయిని మూడు రోజుల పాటు గదిలో బంధించి హింసించిన ఓ కుర్రోడి అదృశ్యంపై కేసు నడుస్తోందని, ఓ క్రిమినల్‌కు కులం అంటగట్టి కొందరు ఎలా వెనకేసుకొస్తారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నిందితుడి తల్లి బాధను నేను అర్థం చేసుకోగలను. అది వేరు. కానీ, ఒక ప్రొఫెషనల్ క్రిమినల్‌లా ప్రవర్తించిన వ్యక్తికి ఎలా మద్దతిస్తారు?” అని ఆయన ప్రశ్నించారు.
కేవలం తమ కులానికి చెందినవాడనే కారణంతో ఒక నేరస్థుడికి మద్దతు పలకడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ తరహా దిగజారుడు రాజకీయాలను జనసేన సహించబోదని స్పష్టం చేశారు.
“ఒక క్రిమినల్‌కు కులం ఎలా అంటగడతారు? ఏ ప్రాతిపదికన అతడిని వెనకేసుకొస్తారు? మీ కులం అయితే సరిపోతుందా? మీ నాయకుడు ఎవరో చెబితే, మీరేంటో నేను చెబుతాను. బూతులు తిట్టేవాళ్లను, క్రిమినల్స్‌ను నాయకులుగా నమ్మితే సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు?” అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను వాడుకుంటోందని, తనను విమర్శించడానికి కాపు సామాజికవర్గానికి చెందిన నేతలనే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
