- ఎగిసిపడుతున్న తిరుగుబాటు జ్వాలలు..
- పాక్ చెర నుంచి విముక్తి కావాలంటూ నినాదాలు..
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. మంగళవారం (జూన్ 09) మధ్యాహ్నం నుండి ప్రారంభమైన బంద్, నిరసనల పిలుపుతో పీఓకే వ్యాప్తంగా తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రావల్కోట్, ముజఫరాబాద్, కోట్లి, భింబర్, దద్యాల్, పాలాండ్రి, సుధనోటి సహా పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో వేలాది మంది స్థానిక ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వానికి, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. పాక్ చెర నుంచి విముక్తి కావాలంటూ స్వతంత్రం కోసం నినాదాలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తంగా మారిపోయింది.
రావల్కోట్లో ఉదయం నుండి ప్రజలు ప్రధాన రహదారులన్నింటినీ దిగ్బంధించారు. భింబర్ నుండి రావల్కోట్ వైపు నిరసనకారులు దూసుకురాకుండా అడ్డుకునేందుకు పాకిస్తానీ పోలీసులు, సైన్యం, రేంజర్లు కర్కశంగా వ్యవహరించారు. నిరసనకారులపై నేరుగా కాల్పులు జరపడంతో పాటు బాష్పవాయువు (టియర్ గ్యాస్) ప్రయోగించారు. అత్యంత ప్రమాదకరమైన పెల్లెట్ గన్లను కూడా వాడటంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాలాండ్రి, సుధనోటి వంటి ప్రాంతాల్లో ప్రజలు చేతుల్లో కర్రలు పట్టుకుని పాక్ బలగాలను ఎదుర్కొన్నారు. నిరసనల దెబ్బకు పీఓకే వ్యాప్తంగా మార్కెట్లు, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి.
