- రాజీనామా చేసిన మంత్రి రామలింగ రెడ్డి..
- మాట తప్పిన శివకుమార్ అంటూ విమర్శలు..
ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి మంత్రిమండలి ఏర్పడిన కొన్నిరోజులకే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసమ్మతి జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఆశించిన మంత్రిత్వ శాఖ దక్కలేదనే అసంతృప్తితో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘బెంగళూరు నగరాభివృద్ధి’ శాఖను కేటాయించకపోవడమే ఆయన కఠిన నిర్ణయానికి కారణమని సమాచారం. కెమెరాల ముందే తన రాజీనామా లేఖపై సంతకం చేసిన ఆయన.. దాన్ని విలేకరులకు చూపిస్తూ తన అసంతృప్తిని పంచుకున్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత బెంగళూరు అభివృద్ధి శాఖను తనకు అప్పగిస్తానని డీకే శివకుమార్ గతంలో ఇంటికి వచ్చి మరీ మాటిచ్చారని రామలింగారెడ్డి మీడియా ముందు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు కూడా డీకేఎస్‌ను కలిసినప్పుడు ఇదే శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. తనకు జరిగిన ఈ అవమానంతో నిరాశకు గురయ్యానని, అందుకే మంత్రి పదవిని వదులుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే తాను కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు సిద్ధరామయ్యపై గానీ, శివకుమార్‌పై గానీ ఎలాంటి వ్యక్తిగత కోపం లేదన్నారు.
