HomeజాతీయంPralhad Joshi | కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు

Pralhad Joshi | కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు

NEET-UG 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో సీనియర్ బీజేపీ నాయకుడు ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.

దేశవ్యాప్తంగా NEET-UG పరీక్ష నిర్వహణపై తీవ్ర విమర్శలు, విద్యార్థుల నిరసనలు, పరీక్షా వ్యవస్థపై పెరిగిన అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖ పరీక్షా విధానంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న కీలక దశలో ఈ నియామకం జరిగింది.

- Advertisement -

ప్రహ్లాద్ జోషి ఇప్పటికే వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ, అలాగే నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. వీటితో పాటు ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను కూడా ఆయన నిర్వహించనున్నారు.
అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, తాను ఈ బాధ్యతను “కర్తవ్య భావంతో, వినయంతో” స్వీకరిస్తున్నానని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భారత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. గత నాలుగైదేళ్లలో ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యా విధానం (NEP) అమలు చేయడంతో పాటు అనేక కీలక విద్యా సంస్కరణలను చేపట్టారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో నేను కూడా అదే నిబద్ధతతో పనిచేసి, నా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాను, అని జోషి వెల్లడించారు.

NEET-UG 2026 పేపర్ లీక్ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం పరీక్షల పారదర్శకత, భద్రత, విశ్వసనీయతను పెంచేందుకు పలు కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి నియామకం దేశ విద్యా రంగంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News