- ఐదు కేసుల గుట్టురట్టు, ఆరుగురు నిందితుల అరెస్ట్!
- మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసుల మెరుపు దాడి
- బాధితులకు రూ. 6.80 లక్షల రికవరీ
- దేశవ్యాప్తంగా విస్తరించిన ముఠాల నెట్వర్క్
నిరుద్యోగుల ఆశలు, పెట్టుబడిదారుల అత్యాశలను ఆసరాగా చేసుకుని కోట్లలో కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌పై మల్కాజ్గిరి కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గతవారంలో (మే 10 నుండి మే 16 వరకు) జరిపిన మెరుపు దాడుల్లో ఐదు కీలకమైన సైబర్ మోసాల గుట్టురట్టు చేసి, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ సైబర్ ముఠాల బారిన పడి మోసపోయిన బాధితులకు కోర్టు ద్వారా రూ. 6.80 లక్షల నగదును తిరిగి ఇప్పించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఐదు విభిన్న మోసాలు.. ఆరుగురు ‘మ్యూల్’ ఏజెంట్లు!
పోలీసులు ఛేదించిన కేసుల వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితులంతా సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇస్తూ (మ్యూల్ అకౌంట్ హోల్డర్స్), కమీషన్లు దండుకుంటున్న స్థానిక ఏజెంట్లుగా తేలింది. మోసాల వివరాలు ఇలా ఉన్నాయి:

- జర్మనీలో ఉద్యోగాలంటూ రూ. 5.40 లక్షల టాక్రా! (కేసు-1)
సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన కాసాని సతీష్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ పాత్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ నుండి ‘దిల్కుష్’ అనే వ్యక్తి ఐడెంటిటీతో నిరుద్యోగులకు జర్మనీలో వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించారు. ఎనిమిది మంది అభ్యర్థుల నుంచి పాస్‌పోర్టులు, సర్టిఫికెట్లు సేకరించి నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించారు. సెక్యూరిటీ డిపాజిట్ పేరిట బాధితుడి నుండి రూ. 5,39,999/- వసూలు చేసి ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. ఈ కేసులో నిందితుడు సతీష్ సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్ అందించినట్లు తేలింది.
- ‘కెప్టెన్ పవార్’ పేరిట ఆర్మీ డ్రామా.. (కేసు-2)
పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన ఇందారపు నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ పోర్టల్‌లో ఫ్లాట్ అద్దెకు ఉందంటూ ప్రకటన ఇచ్చిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. తాను ఆర్మీ క్యాప్టెన్ పవార్ అని పరిచయం చేసుకుని, మిలిటరీ ప్రొటోకాల్ ప్రకారం అడ్వాన్స్ పేమెంట్లు చేయాలంటూ నమ్మించారు. ఆటోపే రిఫండ్ వస్తుందంటూ నమ్మించి బాధితురాలి నుంచి ఐదు విడతల్లో రూ. 2,75,545/- కాజేశారు. నవీన్ ఈ కేసులో అకౌంట్ ప్రొక్యూరర్గా వ్యవహరించాడు.
- వాట్సాప్ ‘VIP’ గ్రూప్.. రూ. 21.50 లక్షలు గోవిందా! (కేసు-3)
హైదరాబాద్‌కు చెందిన కొమ్ము విష్ణు (కోదండరామ్‌నగర్/కొత్తపేట), మక్కల అరవింద్ (కుత్బుల్లాపూర్)లను పోలీసులు జైలుకు పంపారు. బాధితుడి ప్రమేయం లేకుండానే “Invesco Q2 Co-Investment Plan-VIP” అనే వాట్సాప్ గ్రూపులో యాడ్ చేశారు. తాము స్టాక్ మార్కెట్ నిపుణులమంటూ నమ్మించి, నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐపీఓలలో బ్లాక్ ట్రేడింగ్ పేరిట రూ. 21.50 లక్షలు పెట్టుబడి పెట్టించారు. తీరా లాభాలు వచ్చాక విత్‌డ్రా చేసుకోబోతే.. బ్రోకరేజ్ ఛార్జీల పేరిట మరో రూ. 5 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
- ‘కస్టమ్స్ డిపార్ట్మెంట్’ పార్సిల్ పేరిట వల.. (కేసు-4)
వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన పందుల శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్ నేహా శర్మ మాట్లాడుతున్నానంటూ బాధితుడికి ఫోన్ చేసి, యూకే నుండి మీ పేరు మీద గోల్డ్ చైన్లు, విదేశీ కరెన్సీ (10,000 GBP) ఉన్న పార్సిల్ వచ్చిందని బెదిరించారు. ఆపై ఆర్బీఐ పేరిట నకిలీ ఈమెయిళ్లు పంపి.. కరెన్సీ కన్వర్షన్, డెమరేజ్ ఛార్జీలు, ఇన్కమ్ టాక్స్ పేరిట రూ. 4,79,000/- గుంజారు.
- ఎండీ ఫోన్ హ్యాక్.. ఒకేసారి రూ. 40 లక్షలు స్వాహా! (కేసు-5)
విజయపురి కాలనీ (వనస్థలిపురం)కి చెందిన నన్నాక రఘునాథ్‌ను సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకసి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (జి. ఆనంద్) ఫోన్‌కు సైబర్ కేటుగాళ్లు ఎవరికీ తెలియకుండా “Rto Traffic E-Challan.apk” అనే ప్రమాదకరమైన హ్యాకింగ్ ఫైల్‌ను ఇన్స్టాల్ చేయించారు. అనంతరం ఆయన వాట్సాప్ అకౌంట్ ద్వారా అకౌంటెంట్‌కు మెసేజ్‌లు పంపి, అర్జెంట్ నెట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఆదేశించారు. ఎండీ గారే పంపించారనుకుని బాధితుడు రెండు రోజుల్లో ఏకంగా రూ. 40,08,000/- బదిలీ చేసి మోసపోయాడు.
అలర్ట్: నెటిజన్లూ.. ఇవి అస్సలు నమ్మకండి!
పార్ట్-టైమ్ ఉద్యోగాలు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ల పేరిట మోసాలు విపరీతంగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) హెచ్చరించారు.
వాక్-ఇన్ లేకుండా వచ్చే పార్ట్ టైమ్ ఉద్యోగ ప్రకటనలను నమ్మొద్దు.
అసాధారణ లాభాలు, గ్యారెంటీ రిటర్న్స్ ఇచ్చే కొత్త వెబ్సైట్లలో పెట్టుబడులు పెట్టకండి.
వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈమెయిళ్లలో వచ్చే గుర్తుతెలియని లింకులను అస్సలు క్లిక్ చేయవద్దు.
ఆన్లైన్ వ్యక్తులు పంపే లింకుల ద్వారా ఎలాంటి ట్రేడింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేయొద్దు.
డిజిటల్ అరెస్ట్ లేదా పార్సిల్ బెదిరింపులకు భయపడకండి. పొరపాటున సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే ‘1930’ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrimes.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి అని తెలిపారు.
