Homeఆదాబ్ ప్రత్యేకంKapra | ఆక్రమించుకో.. అక్రమ నిర్మాణాలు చేసుకో..!

Kapra | ఆక్రమించుకో.. అక్రమ నిర్మాణాలు చేసుకో..!

  • ఎలాంటి సమస్యలు మీకు ఎదురుకావు..
  • అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారులు..
  • కాప్రాలో వెలుగు చూసిన భారీ ఇనాం దందా.. !
  • ఓ.ఆర్.సి. గురించి అడిగితే కొత్త భాష్యం చెబుతున్న ఎమ్మార్వో..
  • ప్లాట్లు వేసేశాక ఇక ఓ.ఆర్.సి.ఎందుకు అంటున్న దారుణం..
  • ప్రభుత్వ భూమి అంటూ బోర్డు తయారు చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్..
  • ఆర్.ఐ. విధులను సైతం అడ్డుకున్న సోకాల్డ్ తహశీల్దార్..
  • కీసరగుట్ట పరమేశ్వరుడి సాక్షిగా సాగుతున్న అవినీతి వ్యవహారం..
  • తక్షణమే మేడ్చల్ కలెక్టర్ దృష్టిసారించాలంటున్న స్థానికులు..

ఆక్రమించిన ఆ భూమికి ఎలాంటి ఓఆర్‌సీ లేదు.. పైగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.. ఈ అక్రమ వ్యవహారం తన దృష్టికి వచ్చినప్పటికీ.. ఓ బాధ్యతగల తహసీల్దార్ ఆ అక్రమ నిర్మాణదారునితో లోపాయికారి ఒప్పొందం కుదుర్చుకుని, భారీ ఎత్తున ముడుపులు తీసుకోని.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిస్సిగ్గుగా, ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో సూచిక బోర్డు ఏర్పాటు చేయుటకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బోర్డ్‌ను సిద్ధం చేయగా తహసీల్దార్ అడ్డుకోవడం విచిత్రంగా అనిపించడమే కాకుండా, పలు అనుమానాలకు తావీస్తుంది.. మరీ దారుణం ఏమిటంటే ఈ విషయంపై కీసర ఆర్డీఓ కూడా పట్టించుకోకపోవడంతో రెవెన్యూ వ్యవస్థపైనే ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు..

కాప్రాలో యథేచ్ఛగా ‘ఇనాం దందా సాగుతోంది.. ఈ వ్యవహారంపై అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు.. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా సర్వే నంబర్ 707లోని అత్యంత విలువైన భూమి ఆక్రమణకు గురవుతోందని సాక్ష్యాధారాలతో “ఆదాబ్ హైదరాబాద” దినపత్రికలో వార్తా కథనం వెలువడింది.. అయినా సంబంధిత అధికారులైన కీసర ఆర్దీఓ గానీ, స్థానిక తహసీల్దార్ గానీ కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీ ఎత్తున ఒప్పొందాలు జరిగాయని, పెద్దమొత్తంలో పైకం చేతులు మారిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు..

- Advertisement -
Kapra Inam Land Scam Allegations Over Survey 707 Illegal Construction

ప్లేట్ ఫిరాయించిన తహసీల్దార్! :

ఈ అక్రమ నిర్మాణాలపై వివరణ కోరినప్పుడు కాప్రా తహసీల్దార్ అత్యంత నైపుణ్యంగా, అమాయకంగా నటించారు.. ఆయనగారి నటనావిన్యాసం ఇప్పుడు బయటపడింది.. పేర్కొన్న సదరు భూమికి ఎలాంటి ఓఆర్సీ లేదని, అక్కడ జరుగుతున్నవన్నీ అక్రమ నిర్మాణాలేనని మొదట ఒప్పుకున్న ఆయన.. జీహెచఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాస్తానని, ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని కల్లోబొల్లి కబుర్లతో నమ్మించారు.. తీరా ఇప్పుడు చూస్తే ఆ లేఖ గురించి అడిగితే నేను చాలా “బిజీగా ఉన్నాను.. ఇంకా రాయలేదు” అంటూ బాధ్యతలు మరచి సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. అంతేకాకుండా ఆయన బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసిపోతోంది.. ఆయనకు తన విధులపట్ల ఏమాత్రం చిత్తశుద్ధిలేదని అర్ధం అవుతోంది.. ఒక అధికారిగా ఆయన గతితప్పి ప్రవర్తిస్తున్నాడని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు..

Kapra Inam Land Scam Allegations Over Survey 707 Illegal Construction2

చట్టాన్ని, విధి విధానాలను అపహాస్యం చేస్తున్న అధికారి :

అసలాయన ఈ విధంగా మాట్లాడతాడని ఎవరూ ఊహించ లేదు.. ఆయన వితండవాదం వింటుంటే మతిపోతోంది.. తహసీల్దార్ నిస్సిగ్గుగా మాట్లాడుతూ.. “ఎప్పుడో ప్లాట్లుగా మారిపోయాయి.. ఇప్పుడు ఓఆర్సీతో ఏం పని?” అని వ్యాఖ్యానించాడు.. ఇది చూస్తుంటే చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి కబ్జాదారులకు ‘సలహాదారు’గా మారిపోయారా అన్న అనుమానం కలుగుతోంది.

చట్టం ఏం చెబుతోంది? :

ఇనాం భూమి ప్లాట్లుగా మారినా, భవనాలుగా మారినా ఓ ఆర్ సి లేకుండా జరిగే ఏ లావాదేవీ అయినా చెల్లనేరదు.. అది చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.. కానీ తహసీల్దార్ వాదన మరోలా ఉంది.. ప్లాట్లు అయిపోయాయి కాబట్టి ఇక నియమ నిబంధనలు అక్కర్లేదు అని.. దీన్నిబట్టి చూస్తే.. తహసీల్దార్ దృష్టిలో అక్రమం జరిగిన తర్వాత దాన్ని ప్రశ్నించడం దండగ అనేకదా అర్ధం.. ఒకవేళ ఇదే వాస్తవం అనుకుంటే.. రేపటిరోజున ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించి రాత్రికి రాత్రే ప్లాట్లుగా చేసేస్తే ఆ వెంచర్ ని కూడా తహసీల్దార్ సమర్థిస్తారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Kapra Inam Land Scam Allegations Over Survey 707 Illegal Construction02

కలెక్టర్ ఈ నిర్లక్షానికి చరమగీతం పాడండి :

రెవెన్యూ అధికారులు, కబ్జాదారుల మధ్య ‘మామూళ్ల’ బంధం బలంగా అల్లుకుపోయిందని, అందుకే చర్యలు తీసుకోవడానికి చేతులు రావడం లేదని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్ బిజీగా ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారంలోనా? లేక అక్రమ వసూళ్ళలో.. అక్రమ నిర్మాణాలకు రక్షణ కల్పించడంలోనా? అన్నది తేలాల్సి ఉంది.

ఇప్పటికైనా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని, సర్వే నంబర్ 707లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విచారణ జరపాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, బాధ్యతారహితంగా మాట్లాడుతున్న కాప్రా తహసీల్దార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ‘ఇనాం దందా’ వెనుక ఉన్న పెద్ద తలకాయల పేర్లను, సర్వే నెంబర్ 707లో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై అన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది

“ఆదాబ్ హైదరాబాద్”.. “మా అక్షరం అవినీతిపై అస్త్రం”..

- Advertisement -
RELATED ARTICLES

Latest News