- అణువిద్యుత్ కేంద్రం సమీపంలో ఘటన..
- ఇది ఇరాన్ చర్యే అని అనుమానం..
- దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఇది ఇరాన్ చర్యేనని భావిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్లాంట్ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. యూఏఈకి దాదాపు 25 శాతం విద్యుత్‌ను అందించే ఈ కీలక కేంద్రంపై దాడి జరగడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
‘యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడిపట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. ఇవి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి. తక్షణమే ఇరుపక్షాలు సంయమనం పాటించి.. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. యూఏఈ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, రేడియేషన్ స్థాయిలో ఎలాంటి మార్పులు లేదని స్పష్టంచేశారు.
పశ్చిమ సరిహద్దు నుంచి మూడు డ్రోన్లు దేశంలోకి ప్రవేశించాయని, వాటిలో ఒకటి అణు కేంద్రం లోపలి ప్రాంగణంలో పడగా, మరో రెండింటిని కూల్చివేసినట్లు తెలిపారు. ఈ దాడిని ‘అకారణంగా జరిగిన ఉగ్రవాద చర్య’ గా యూఏఈ ప్రభుత్వం అభివర్ణించింది. తమ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఎలాంటి చర్యలను సహించబోమని, ప్రతీకారం తీర్చుకునే పూర్తి హక్కు తమకుందని హెచ్చరించింది. దాడి జరిగిన వెంటనే యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు దేశాల విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు.
