నారాయణ విద్యాసంస్థలు కేకే క్యాంపస్ అక్రమాలు బట్టబయలు
- అరచేతిలో వైకుంఠం.. లోపల నరకం.. !
- రూ. 6 లక్షల ఫీజులు.. కానీ విద్య జీరో
- ఇది కాలేజ్ కాదు.. కమర్షియల్ ట్రాప్
- విద్య పేరుతో నారాయణ భారీ దోపిడి
- జేఈఈ మెయిన్ ఫలితాలు చెప్పిన నిజం..
- చేస్తున్న ప్రచారం వేరు, వాస్తవం వేరు..!
- ఇంటర్లోనూ ఫెయిల్ అవుతున్న విద్యార్థులు
- విద్యార్థుల భవిష్యత్తుకు బాధ్యత ఎవరిది..?
ఆర్భాటపు ప్రకటనలు.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా.. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ.. తల్లిదండ్రులను ఆకర్షిస్తూ.. నిలువునా దోచుకుంటోంది నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం.. 40 నుంచి 50 మంది విద్యార్థులను ఎంచుకుని వారిని ఉద్దండులుగా తీర్చిదిద్దుతామని చెబుతూ లక్షల్లో ఫీజులు కొల్లగొడుతున్నారు.. తీరా చూస్తే వారిలో ఒక్కరికి కూడా స్టేట్ ర్యాంక్ రాకపోవడం విషాదకరం.. ఇటు తల్లిదండ్రుల రక్తాన్ని పీలుస్తూ.. అటు విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ నారాయణ విద్యాసంస్థలు చేస్తున్న దోపిడీ పర్వం నిరాటంకంగా సాగుతోంది.. ఏ ప్రభుత్వాలు కూడా టచ్ చేయని స్థాయికి చేరుకుంది.. తల్లి దండ్రులారా తస్మాత్ జాగ్రత్త.. మీరైనా ఆలోచించండి.. మీ పిల్లల బంగారు భవిష్యత్తును నారాయణ చేతిలో పెట్టి బుగ్గిపాలు చేయకండి..
కేకే కాలేజ్ క్యాంపస్ పేరుతో నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలపై వస్తున్న ఆరోపణలు ఒక వ్యక్తిగత సమస్య కాదు? ఇది మొత్తం ఎడ్యుకేషన్ వ్యవస్థలో పెరుగుతున్న కమర్షియలైజేషన్‌కు ప్రతిబింబం. “అరచేతిలో వైకుంఠం” చూపిస్తూ అడ్మిషన్లు తీసుకోవడం.. ఇది ఇప్పుడు ఒక స్ట్రాటజీగా మారిపోయింది. తల్లిదండ్రులకు టాప్ ర్యాంకులు, ఐఐటి లు, మెడికల్ సీట్లు అనే కలలు చూపించి.. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 5 నుంచి 6 లక్షల వరకు భారీ ఫీజులు వసూలు చేయడం జరుగుతోంది. కానీ వాస్తవానికి క్యాంపస్‌లో పరిస్థితి పూర్తిగా వేరేలా ఉంటుంది.

కేవలం 40`50 మంది “సెలెక్టెడ్ స్టూడెంట్స” పై మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టి, వారికి మాత్రమే మంచి ఫ్యాకల్టీ, ప్రత్యేక క్లాసులు, అదనపు గైడెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ స్టూడెంట్స్‌ను టాప్ ర్యాంకుల కోసం తయారు చేస్తారు. కానీ అదే బ్రాంచ్‌లో ఉన్న మిగతా 300?400 మంది విద్యార్థులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వారికి సాధారణ బోధన కూడా సరైన స్థాయిలో అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2026 జేఈఈ మెయిన్ ఫలితాలు చూస్తే అసలు నిజం బయటపడుతుంది. ప్రచారంలో చెప్పినంతగా ఈ క్యాంపస్ నుంచి టాప్ ర్యాంకులు రావడం లేదు. అయినప్పటికీ తప్పుడు ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేయడం కొనసాగుతోంది. ఒక సాధారణ వ్యక్తి ఇదే విషయాన్ని ప్రశ్నించిన తర్వాత మాత్రమే కొంత జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతోంది..
ఇది వాళ్ల ఉద్దేశం ఏమిటో స్పష్టంగా ఉందో చూపిస్తుంది. ఈ కేకే క్యాంపస్ నారాయణ కాలేజ్ వాళ్ళు చేసేది మోసం కాదా? నేరం కాదా? ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, కొంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా పాస్ కాకపోవడం. అంటే, బేసిక్ అకడమిక్ సపోర్ట్ కూడా అందించడం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం అకడమిక్ ఫెయిల్యూర్ కాదు.. ఇది ఒక వ్యవస్థబద్ధమైన నిర్లక్ష్యం.

ఈ పరిస్థితుల వల్ల తల్లిదండ్రుల కష్టార్జిత డబ్బు వృథా అవుతోంది. విద్యార్థుల మానసిక స్థితి దెబ్బతింటోంది. ఆత్మవిశ్వాసం పూర్తిగా కూలిపోతోంది. భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతోంది.. “ఎడ్యుకేషన” పేరుతో“కమర్షియల్ మాఫియా” నడుస్తోంది అనడం అతిశయోక్తి కాదు. ఇది ఒక వ్యాపార మోడల్‌గా మారిపోయింది.. కొంతమందిని టాప్‌లో చూపించి, మిగతావారిని బలి చేయడం దారుణం..
ఇలాంటి అంశాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. క్యాంపస్‌లపై సమగ్ర తనిఖీలు జరిపి.. ఫీజు నిర్మాణం, బోధన నాణ్యత, విద్యార్థులపై వివక్ష.. తప్పుడు ప్రకటనలు.. వీటన్నింటిపై విచారణ జరపాలి. ఇది కేవలం ఒక కాలేజ్ సమస్య కాదు? ఇది వేలాది కుటుంబాల భవిష్యత్తుతో సంబంధం ఉన్న విషయం. విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థుల కలలతో ఆడుకునే ఇలాంటి వ్యవస్థలను నిలువరించడం సమాజం మొత్తం బాధ్యత.
