- సరైన స్నాక్స్ ఎంచుకోవడం ముఖ్యం..
- శక్తినిచ్చే చిరుతిండ్లు తీసుకోవాలి..
రోజంతా కార్యాలయంలో పని చేసే చాలామందికి మధ్యాహ్నం తర్వాత అలసట, ఏకాగ్రత తగ్గడం, మళ్లీ మళ్లీ కాఫీ లేదా టీ తాగాలనిపించడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సరైన స్నాక్స్‌ను ఎంచుకోకపోవడమేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరానికి స్థిరమైన శక్తిని అందించే ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తీసుకుంటే మధ్యాహ్నం వచ్చే ఎనర్జీ క్రాష్‌ను నివారించవచ్చని సూచిస్తున్నారు. చాలామంది కార్యాలయానికి చేరుకున్న వెంటనే ఆకలి వేయడంతో కాఫీ లేదా టీతోపాటు బిస్కెట్లు, చిప్స్ వంటి అధిక చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను తీసుకుంటారు.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి, కొద్ది సేపటికే వేగంగా తగ్గిస్తాయి. దీంతో శరీరంలో శక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, మళ్లీ కాఫీ లేదా తీపి పదార్థాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. పోషకాహారం, మెదడు పనితీరుపై జరిగిన పరిశోధనల ప్రకారం, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే స్థిరంగా శక్తిని అందించే స్నాక్స్‌ను ఎంచుకోవడం వల్ల శరీరం, మెదడు రెండూ చురుకుగా పనిచేస్తాయి. ఇందుకోసం ఖరీదైన సూపర్‌ఫుడ్స్ కొనాల్సిన అవసరం లేదని, మన ఇంట్లోనే లభించే భారతీయ ఆహార పదార్థాలతో కూడా ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తయారు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
స్నాక్స్ తీసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలని సూచిస్తున్నారు. కార్బోహైడ్రేట్లను ఒంటరిగా తీసుకోవడం కంటే వాటికి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లేదా ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను జతచేయడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదలై, శక్తి ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. దీంతో ఆకలి త్వరగా వేయకుండా ఉండటంతోపాటు మెదడుకు కూడా నిరంతర శక్తి అందుతుంది.
