Saturday, April 25, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంKavitha | తెలంగాణ గొంతుకై ప్రజలకు వెలుగై

Kavitha | తెలంగాణ గొంతుకై ప్రజలకు వెలుగై

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర అధ్యాయం ఆవిష్కృతం కావడానికి రంగం సిద్ధమైంది. ఉద్యమ రాజకీయాల నుంచి ఎదిగి, ప్రత్యేక గుర్తింపు సాధించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు స్వతంత్ర రాజకీయ శక్తిగా అవతరించేందుకు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్కు దూరమైన తర్వాత, ప్రజా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కొత్త రాజకీయ వేదికను నిర్మించాలనే దిశగా ఆమె కదులుతున్నారు.

  • మరికొన్ని గంటల్లోనే కవిత కొత్త పార్టీ ప్రకటన
  • బీఆర్ఎస్కు దూరమై స్వతంత్ర రాజకీయ ప్రస్థానం
  • బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన మహిళామణి..
  • మహిళలు, యువత, అణగారిన వర్గాలపై ఫోకస్
  • బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కన్నేసిన కవిత
  • కేడర్ ఎంతమేరకు సహకరిస్తుందన్నది కీలకం
  • కాంగ్రెస్, బీజేపీ నుంచి విమర్శల దాడి
  • లిక్కర్ కేసు కవితకు క్లీన్ చిట్తో ఇమేజ్ బూస్ట్
  • థర్డ్ ఫోర్బ్స్ గా ఎదుగుతుందా..? అన్నదే హాట్ టాపిక్

తెలంగాణ బతుకమ్మగా ఆమెకు పేరు.. తెలంగాణా ఉద్యమానికి సాంస్కృతిక జిలుగులు అద్దిన వీరవనిత.. తండ్రినుంచి పుణికిపుచ్చుకున్న రాజకీయ మేధస్సుతో తనదైన శైలితో సాగిపోతున్న పరిణితి చెందిన మహిళా రాజకీయవేత్త.. ఉన్నత చదువులు అభ్యసించి, విదేశాల్లో అత్యున్నత బాధ్యతలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టి, బతుకమ్మ అంబురాలతో ఉద్యమాన్ని అంబరం తాకేలా అహర్నిశలు కృషిచేసిన నాయకురాలు.. తనకు అప్పగించిన బాధ్యతలను తుచ తప్పకుండా నిర్వర్తిస్తూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మారింది..

- Advertisement -

చెరగని చిరునవ్వుతో.. నిక్కచ్చిగా సంభాషిస్తూ.. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గళం విప్పుతూ తెలంగాణ ఉద్యమ పార్టీగా పేరుపొందిన బీఆరఎస్ పార్టీ బలోపేతానికి తన వంతుగా సేవ చేశారు.. కాలం చేసిన కొన్ని గాయాలను భరిస్తూ.. మొక్కవోని ధైర్యంతో, తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.. ఈరోజు తెలంగాణ రాజకీయ స్వరూపాన్ని మార్చాలనే దృఢ సంకల్పంతో.. తాను నమ్మిన సిద్ధాంతాన్ని విడువకుండా ముందడుగు వేస్తున్నారు..

తెలంగాణ ఉద్యమకారుల బాగుకోసం, యువత భావితవ్యం కోసం.. మహిళల సాధికారత కోసం.. రైతుల అభ్యున్నతి కోసం.. అన్నివర్గాల అభివృధ్ధికోసం కంకణం కట్టుకున్నారు.. కల్వకుంట్ల కవిత నవీన రాజకీయాల్లో ఒక బ్రాండ్ గా నిప్పులు చేరిగేందుకు రాజకీయ పార్టీని స్థాపిస్తున్న సందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ అభినందనలు తెలియజేస్తోంది..

తెలంగాణ రాజకీయ కాన్వాస్ పై ఒక అద్వితీయ చిత్రం మెరవబోతోందా..? సరికొత్త అధ్యాయం మొదలవుతోందా? ‘తెలంగాణ జాగృతి’ ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఊపిరి పోసి, ‘బతుకమ్మ’ను విశ్వవ్యాప్తం చేసిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు నేరుగా ప్రజల బతుకుల్లో మార్పు కోరుతూ సొంత రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సొంత రాజకీయ పార్టీతో కొత్త ప్రస్థానం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లోనే అధికారికంగా కొత్త పార్టీని ప్రకటించనున్నారు.

బీఆరఎస్ ఆవిర్భావ దినోత్సవానికి ముందు ఈ నిర్ణయం రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తండ్రి కేసీఆర్ స్థాపించిన బీఆరఎస్‌కు దూరమై, స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని కవిత తీసుకున్న నిర్ణయం సాహసోపేతమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లో బలమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె, బతుకమ్మ వంటి సాంస్కృతిక అంశాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నాయకురాలిగా పేరు సంపాదించారు. ఇప్పుడు అదే సామాజిక ఆధారాన్ని రాజకీయ శక్తిగా మలచాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నారు.

తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ ప్రేరేపిస్తూ, పాత టీఆరఎస్ ఓటు బ్యాంకును ఆకర్షించడమే కవిత వ్యూహంగా కనిపిస్తోంది. మహిళలు, యువత, అణగారిన వర్గాలను కేంద్రంగా చేసుకుని పార్టీ నిర్మాణం ఉండబోతుందనే సంకేతాలు అందుతున్నాయి. పురుషాధిక్య రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా నిలవాలనే లక్ష్యంతో ఆమె అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

కవిత కొత్త పార్టీ ప్రకటనతో బీఆరఎస్‌లో కలకలం రేగే అవకాశం ఉంది. అయితే, పార్టీ శ్రేణులు ఎంతమేరకు ఆమె వెంట నడుస్తారన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలే ప్రధానంగా ఆమెకు అండగా కనిపిస్తున్నప్పటికీ, గులాబీ పార్టీ కేడర్‌లో పెద్ద ఎత్తున మార్పులు ఇంకా కనిపించడం లేదు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వానికి బలమైన మద్దతు కొనసాగుతున్న నేపథ్యంలో, కవిత తన శక్తిని ఎంతవరకు విస్తరించగలదన్నది కీలకంగా మారింది.

ఇక అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే ఈ కొత్త రాజకీయ ప్రయోగంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కవిత పార్టీని బీఆరఎస్ బీ`టీమ్‌గా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ రావడం ఆమెకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ పరిణామం ఆమె రాజకీయ ఇమేజ్‌ను కొంతవరకు బలపరిచినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. రాజకీయ కక్షల వల్లే తనపై ఆరోపణలు వచ్చాయని చెబుతూ, ప్రజల్లోకి వెళ్లే అవకాశాన్ని ఆమె వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన వర్గాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు భరోసా, బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం, మహిళా సాధికారత.. ఈ మÖడింటిపై కవిత రాజకీయ అజెండా తిరుగుతున్నట్లు అంచనా. గాంధీ సర్వోదయ సిద్ధాంతాలను ప్రస్తావిస్తూ సమాన అవకాశాల దిశగా ముందుకు సాగాలని ఆమె సంకేతాలు ఇస్తున్నారు.

ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఈ ప్రయాణం అంత సులభం కాదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆరఎస్, బీజేపీ వంటి బలమైన పార్టీలు ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీ స్థిరపడటం పెద్ద సవాల్. పైగా, కేసీఆర్ కుటుంబానికి చెందిన నాయకురాలనే ట్యాగ్‌ను దాటి స్వతంత్ర నాయకత్వాన్ని నిరూపించుకోవడం కవిత ముందున్న ప్రధాన పరీక్షగా మారింది.

అయినా, కవితకు ఉన్న బలాలు కూడా గమనించదగ్గవే. తెలంగాణ జాగృతి ద్వారా గ్రామస్థాయిలో ఏర్పరచుకున్న నెట్‌వర్క్, బతుకమ్మ వంటి సాంస్కృతిక ఉద్యమాల ద్వారా సంపాదించిన గుర్తింపు, ఎంపీగా, ఎమ్మెల్సీగా పొందిన అనుభవం.. ఇవి ఆమెకు రాజకీయంగా బలాన్నిస్తున్న అంశాలు. ముఖ్యంగా మహిళా వర్గాల్లో ఆమెకు ఉన్న అనుబంధం కొత్త పార్టీకి ప్లస్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా నుంచి క్షేత్రస్థాయి వరకూ ప్రజలతో మమేకమవ్వడంపై కవిత ఫోకస్ పెంచారు. జన సమస్యలే అజెండాగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆమె వ్యూహాలు, ప్రజా మద్దతు ఎలా రూపుదిద్దుకుంటాయన్నదే కీలకం.

రాజకీయాల్లో గెలుపోటముల సంగతి పక్కనపెడితే, అన్నింటినీ తట్టుకొని నిలబడమే తత్వమే నాయకత్వంపై జనంలో నమ్మకం కలిగేలా చేస్తుంది. కవిత చూపిస్తున్న ఈ దూకుడు.. ఆమె ఎంచుకునే సిద్ధాంతం, ఆమె ఎజెండా అన్నీ పక్కాగా సెట్ అయితే.. తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్లో.. కచ్చితంగా ఆమె పేరు రీసౌండ్లో వినిపిస్తుంది.

ఈ క్రమంలో.. కవిత ప్రకటించబోయే పార్టీ.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తుందా? మిగతా పార్టీలకు ఆల్టర్నేట్గా ఎదుగుతుందా? లేక.. కేవలం ఓ ప్రాంతీయ పార్టీగా మిగిలిపోతుందా? అనేది.. భవిష్యత్లో తేలిపోతుంది. కానీ.. కల్వకుంట్ల కవిత పార్టీతో… తెలంగాణ రాజకీయాల్లో మొదలయ్యే కొత్త దశ.. కచ్చితంగా ఊహించని పోటీకి దారితీస్తుందనేది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News