- ఆదాబ్ కథనంతో బయటపడిన చెరువు కబ్జా..
- ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు గుర్తింపు
- చెరువును పూడ్చి ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు నిర్ధారణ
- కబ్జా వాస్తవమేనని అధికారిక లేఖలో అంగీకారం
- కబ్జాదారుడు అనంత రెడ్డి అని ఇరిగేషన్ శాఖ నిర్ధారణ
- కూల్చివేతలు, క్రిమినల్ చర్యలు మాత్రం ఇంకా పెండింగ్
- లేఖలు కాదు.. బుల్డోజర్లు ఎప్పుడంటూ ప్రజల ప్రశ్న
జీవో 111 నిబంధనలను బూడిదలో పోసిన పన్నీరు చేస్తూ, శంషాబాద్ మండలంలోని సుమారు 35 ఎకరాల నరసింహ కుంట (నరసింహ చెరువు) గుండెల్లో వెలిసిన కాంక్రీట్ సామ్రాజ్యంపై ‘ఆదాబ్ హైదరాబాద’ ప్రచురించిన సంచలన కథనానికి అధికార యంత్రాంగంలో చలనం అయితే వచ్చింది కానీ, క్షేత్రస్థాయిలో ఆక్రమణలను అడ్డుకోవాలనే నిజాయితీ గల ‘సోయి’ మాత్రం కనిపించడం లేదు. పత్రికలో వార్త వచ్చిన వెంటనే ఇరిగేషన్ అధికారులు మేల్కొని, ఉన్నపళంగా ఒక లేఖను తయారు చేసి శంషాబాద్ మండల్ తహసిల్దార్ కి పంపించి చేతులు దులుపుకున్నారు.
కథనం తర్వాతే ఉమ్మడి తనిఖీలు.. ముందేం చేశారు?
ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. రాకేష్ కుమార్ శంషాబాద్ తహసిల్దార్‌కు రాసిన అధికారిక లేఖ ప్రకారం.. ‘ఆదాబ్ హైదరాబాద’ పత్రికా కథనం ఆధారంగానే వారు స్పందించినట్లు స్పష్టంగా ఒప్పుకున్నారు . ఈ వార్త ప్రచురితమైన అనంతరం ఇరిగేషన్ అధికారులు, ఏసీపీ, టౌన్ ప్లానింగ్, జీహెచఎంసీ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఉమ్మడిగా సదరు స్థలాన్ని తనిఖీ చేశారు. అయితే, ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్న ప్రధానాంశం ఏమిటంటే.. రాత్రింబవళ్లు వందలాది లారీల మట్టితో చెరువును పూడ్చివేస్తూ, భారీ ఫంక్షన్ హాల్ పిల్లర్లు లేపుతుంటే, ఈ శాఖల అధికారులందరికీ కళ్లు కనిపించలేదా? ‘ఆదాబ్ హైదరాబాద’ నిలదీసే వరకు వీరి నిఘా వ్యవస్థ ఏమైంది?

కబ్జాదారుడి పేరు బహిరంగం.. చర్యల్లో మాత్రం ఎందుకు జాప్యం?
అధికారుల సంయుక్త తనిఖీల్లో నరసింహ చెరువు కబ్జాకు గురవుతున్న మాట వాస్తవమేనని తేలింది. చిన్న గోల్కొండ గ్రామానికి చెందిన హెచ్. నెం: 2 – 43 నివాసి అయిన జి. అనంత రెడ్డి (తండ్రి: జి. కృష్ణారెడ్డి) అనే వ్యక్తి, నరసింహ చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ మరియు బఫర్ జోన్‌లను పూర్తిగా మట్టితో పూడ్చివేసి, అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తమ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
చెరువుల రక్షణ చట్టాల ప్రకారం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లేదా నాలా పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అది తీవ్రమైన నేరం మరియు చట్టవిరుద్ధం . తప్పు చేసిన వ్యక్తి ఎవరో స్పష్టంగా ఆధారాలతో సహా దొరికిపోయినా, తహసిల్దార్ కి “తక్షణమే తగిన చర్యలు తీసుకోండి” అంటూ కేవలం కాగితాల మీద సిఫార్సులు రాయడానికే ఇరిగేషన్ అధికారులు పరిమితమయ్యారు.
నటన చాలు.. బుల్డోజర్లు ఎప్పుడు దిగుతాయి?
అక్రమార్కులకు ఇరిగేషన్ , స్థానిక రెవెన్యూ అధికారుల పూర్తి సహాయ సహకారాలు, మామూళ్ల అండదండలు ఉన్నాయనే అనుమానాలకు ఈ లేఖల వ్యవహారం మరింత బలపరుస్తోంది. తప్పు జరిగిందని తేలాక, సదరు అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి, కబ్జాదారుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఇంకెందుకు కాలయాపన చేస్తున్నారు? కేవలం పత్రికా కథనాల నుంచి, ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికే అధికారులు ఈ లేఖల నాటకానికి తెరతీశారని స్థానికులు మండిపడుతున్నారు.
భవిష్యత్తు తరాల పర్యావరణాన్ని, 35 ఎకరాల సువిశాల జలవనరును కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, తక్షణమే సదరు కబ్జాదారుడు జి. అనంత రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అక్కడ వేసిన మట్టిని తొలగించి, నిర్మిస్తున్న కాంక్రీట్ పిల్లర్లను కూల్చివేసే వరకు ‘ఆదాబ్ హైదరాబాద’ తన అక్షర పోరాటాన్ని ఆపదు. అవినీతి అధికారుల బండారాన్ని, భూబకాసురుల అరాచకాలను తదుపరి కథనాల్లో సైతం నిరంతరం వెలుగులోకి తెస్తూనే ఉంటాం. ?
