- సంచలన వ్యాఖ్యలు చేసిన మనోజ్ తివారి..
- ముంబై టీమ్ పై విరుచుకుపడ్డ వైనం..
ప్రతి సీజన్లో పంజా విసిరే ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్లుగా తేలిపోతోంది. పంతొమ్మిదో ఎడిషన్‌ను విజయంతో ఆరంభించినా వరసగా మూడు ఓటములతో ముంబై వెనకబడింది. సొంత మైదానమైన వాంఖడేలోనూ ముంబై పాచిక పారలేదు. లీగ్ దశలో తడబాటులో ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ కెప్టెన్సీ మార్పు అనివార్యమని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అంటున్నాడు. ఐదుసార్లు ఛాంపియన్ మళ్లీ మునపటి జోరందుకోవాలంటే రోహిత్ శర్మకు తిరిగి సారథ్యం అప్పగించాలని తివారీ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ హవానే వేరు. ఏకంగా ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఈమధ్య కాలంలో తడబడుతోంది. టీ20 సారథిగా మెప్పించిన హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆ జట్టు పేలవమైన ఆటతో నిరాశపరుస్తోంది. పంతొమ్మిదో సీజన్లో ఈ మేటి జట్టు ఒకేఒక విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో ఆమడ దూరంలో ఉంది. వాంఖడేలో పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో హార్దిక్ పాండ్యా బృందం ఓటమిని అభిమానులే కాదు ఫ్రాంచైజీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పుతోనే ముంబై మళ్లీ విజయాల తోవ తొక్కుతుందని మనోజ్ తివారీ అంటున్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడిన తివారీ.. మళ్లీ రోహిత్‌ను కెప్టెన్ చేయాలని సూచించాడు.
