- ఒప్పొందాన్ని ఉల్లంగిస్తే తిరిగి దాడులు చేస్తాం..
- మా వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయని హెచ్చరిక..
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌కు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తే, తిరిగి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయని చెప్పింది. ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పది రోజులపాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.
ఇప్పటికే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కూడా అమెరికా వెల్లడించింది. ఇజ్రాయెల్-లెబనాన్ దేశాల నేతల మధ్య దశాబ్దాల తర్వాత తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించాడు. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కూడా కాల్పుల విరమణ పాటిస్తూ, ఈ పది రోజులు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు. దీనివల్ల ఎలాంటి చంపుకోవడాలు, దాడులు ఉండవని, శాంతి ఏర్పడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ స్పందిస్తూ.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటించకపోతే, తాము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ ఒప్పందం నేపథ్యంలో లెబనాన్‌లోని ప్రజలు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు. ఇంతకాలం యుద్ధం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.
