- శాంతి చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం..
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పశ్చిమాసియా లో ఉద్రిక్తతలు మాత్రం ముగిసిపోలేదు. కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ , లెబనాన్ పై దాడులు చేయడం, అందుకు ప్రతిగా ఇరాన్ హర్మూజ్ జలసంధి ని మళ్లీ మూసివేయడం లాంటి పరిణామాలు ఉద్రిక్తతలను పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఏప్రిల్ 11న రాజధాని ఇస్లామాబాద్ లో చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు, కీలక రహదారి మార్గాల వద్ద భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి.
రాజధానిలోని రెడ్‌జోన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. అక్కడ పరిమిత సంఖ్యలోనే జనసంచారం కనిపిస్తోంది. అంటే ఒక రకంగా రెడ్‌జోన్‌ను పూర్తిగా సీల్ చేశారు. అంటే మూతవేశారు. ఇస్లామాబాద్‌లో ఉన్న పార్లమెంట్, కీలక ప్రభుత్వ కార్యాలయాలు, లగ్జరీ హోటళ్లు, ఎంబసీలు, విదేశీ సంస్థల కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా పిలుస్తారు. శాంతి చర్చల నేపథ్యంలో ఇప్పుడు ఇస్లామాబాద్‌లో సెలవు ప్రకటించారు. దుకాణ సముదాయాలు కూడా మూతపడ్డాయి.
