- త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం..
- ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని విమర్శ..
కేంద్ర సర్కారు పైన, సీబీఎస్ఈ పైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని, దేశ భాషా వైవిధ్యానికి తూట్లు పొడిచే ప్రయత్నమని మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ పాలసీని తమిళనాడు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది.
ఈ నేపథ్యంలో స్టాలిన్ మరోసారి ఘాటుగా స్పందించారు. ఇది సాధారణ విద్యా సంస్కరణ కాదని, భారతీయ భాషలను ప్రోత్సహిస్తున్నామనే ముసుగులో హిందీని రుద్దేందుకు జరుగుతున్న ఆందోళనకర ప్రయత్నమని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇతర ప్రాంతీయ భాషలను పక్కనపెట్టి హిందీకి అగ్రస్థానం కల్పిస్తోందని ఆరోపించారు. భాషా విధానం పేరుతో హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని విస్తరించాలని చూస్తున్నారని, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు ఇది బలవంతంగా హిందీని నేర్పడమే తప్ప మరొకటి కాదని అన్నారు.
