- భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు
మామడ మండలంలోని బండల్ ఖానాపూర్ గ్రామంలో మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో ‘అవల్ రూరల్ లైవిలిహుడ్ ఎంపవర్ మెంట్ సొసైటీ’ (స్వచ్ఛంద సంస్థ) సహకారంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ‘నీరు, లింగ సమానత్వం’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు పి. శ్రీనివాస్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భూగర్భ జలాలను పొదుపుగా వాడుకోవాలని, భావి తరాల కోసం నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా నీటి నిర్వహణలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, వృధాగా పోయే ప్రతి నీటి బొట్టును భూమిలోకి మళ్లించాలని కోరారు.
గ్రామస్థులంతా నీటి పొదుపును ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నీటిని పొదుపుగా వాడుతూ ఆదర్శంగా నిలుస్తున్న పలువురిని ఈ సందర్భంగా శాఖా పరంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధు, రైతులు పాల్గొన్నారు.
