- వివాదాస్పద వెంచర్‌లో పరిశీలించిన డీఎల్‌పీవో
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని ఒక వివాదాస్పద వెంచర్‌లో చోటు చేసుకున్న అక్రమాలపై ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. పత్రికలో వెలుగులోకి వచ్చిన అంశాలను జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకుని వెంటనే విచారణకు శ్రీకారం చుట్టారు.ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ లెవల్ పంచాయతీ ఆఫీసర్ (డీఎల్‌పీవో) వి.సాంబి రెడ్డి సంబంధిత వెంచర్‌ను ప్రత్యక్షంగా సందర్శించి స్థలాన్ని పరిశీలించారు.
గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ వెంచర్‌లో ప్లాట్ల విక్రయాలు,లేఅవుట్ అనుమతులు,పార్కు స్థలాల కేటాయింపు,రోడ్లు తదితర అంశాలపై అధికారికంగా వివరాలు సేకరించారు.2013 సంవత్సరంలో కడ్తాల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 4,65,66 లలో ఒక వెంచర్ యజమాని ఈ ప్రాంతంలో లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్లను గ్రామానికి చెందిన ఇద్దరు బడా నాయకులు లతో కలిసి విక్రయించారు.

అయితే లేఅవుట్‌లో పార్కులు,రహదారులు వంటి ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కూడా అప్పటి అధికారుల, నాయకుల అండదండలతో అక్రమంగా ఇతరులకు అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా పార్కు కోసం కేటాయించిన స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు,రోడ్లు కూడా అమ్ముకున్నట్లు బాధితులు చెబుతున్నారు.ఈ అంశాలపై పత్రికలో కథనం ప్రచురితమైన వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి,వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వెంచర్‌ను సందర్శించారు.
ఆదాబ్ హైదరాబాద్ కథనంతో వెలుగులోకి..
ఈ సందర్భంగా డీఎల్‌పీవో వి.సాంబిరెడ్డి గ్రామపంచాయతీ రికార్డులు,లేఅవుట్‌కు సంబంధించిన పత్రాలు,అనుమతుల వివరాలను పరిశీలించారు.అలాగే వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకు న్నారు.వెంచర్‌లో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు తెలిపారు. అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.

ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో కథనం వెలువడిన తరువాత అధికారులు స్వయంగా వచ్చి పరిశీలించడం స్థానికంగా చర్చనీయాం శమైంది.చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు మాత్రం ఈసారి నిజమైన విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.అధికారుల పరిశీలనతో వివాదాస్పద వెంచర్ వ్యవహారం మరోసారి వెలుగులోకి రావడంతో,భవిష్యత్తులో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగు తుందో అన్న ఆసక్తి స్థానికుల్లో నెలకొంది.
ఈ కార్యక్రమం లో కడ్తాల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అల్లాజీ,సిబ్బంది సాయి బాబా,బొల్ల రమేష్ మరియు కడ్తాల్ సర్పంచ్ రాయికంటి భిక్షపతి,ఉపసర్పంచ్ యాదగిరి రెడ్డి,వార్డు సభ్యులు ముత్తి కృష్ణ,ఎర్రోళ్ల రాఘవేందర్,భానుకిరణ్,మంకి శ్రీను,కడ్తాల్ బిసి సంఘం అధ్యక్షుడు పిప్పల్ల వెంకటేష్,నాయకులు జహంగీర్ బాబా,చేగురి మహేష్,దుడ్డు నాగరాజు,కొప్పు కృష్ణ,పెరుమల్ల మల్లయ్య,కర్రోళ్ల రమేష్,మోగిళ్ళ మహేష్,రాజశేఖర్,ఇమ్రాన్ బాబా,రాజేందర్ గౌడ్,రాయికంటి సురేష్,మాలే మల్లేష్ గౌడ్ మరియు బాధిత కుటుంబాలు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
